'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బలగం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎల్లమ్మ. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతుండగా, ఆయన నటన చూసిన ప్రేక్షకులు తప్పకుండా షాక్‌కు గురవుతారని దర్శకుడు వేణు ధీమా వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడిగా ప్రేక్షకులను ఎంతగా అలరించారో, నటుడిగా కూడా అదే స్థాయి మ్యాజిక్ చూపిస్తారని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ వాతావరణం, సహజమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ పర్షి అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. నటనతో పాటు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం కూడా సమకూరుస్తుండటం విశేషం. ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ సంప్రదాయ జానపద రిథమ్ కళాకారులతో కలిసి టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు సుమారు అరవై శాతం చిత్రీకరణ పూర్తవగా, ఇటీవల గండికోట పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Also Read: 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు