సీఓపీ31 శిఖరాగ్ర సదస్సు ఒప్పందం లేకుండా ముగింపు
సూర్య అంతర్జాతీయ డెస్క్: తుర్కియేలోని అంటాల్యా వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు సీఓపీ31 (COP31) కీలక వాతావరణ ఒప్పందం లేకుండానే ముగిసింది. శిలాజ ఇంధనాల దశలవారీ వినియోగం, వాతావరణ నిధుల అంశాలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ పరిణామంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పందిస్తూ, సదస్సు ముగిసే వరకు భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని, ఏకాభిప్రాయం కోసం నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ముసాయిదా తుది నిర్ణయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.
చారిత్రక మరియు కొనసాగుతున్న కర్బన ఉద్గారాలు ప్రపంచ కార్బన్ బడ్జెట్‌లో అత్యధిక భాగాన్ని వినియోగించుకున్నాయని, అయితే ముసాయిదా ఒప్పందంలో ఈ అంశాన్ని సరిగా ప్రస్తావించలేదని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్రంగా పడుతున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వాతావరణ నిధులు, సాంకేతికత, సామర్థ్య నిర్మాణ సహకారం అందాల్సిన స్థాయిలో లేవని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా వనరులు ఉండాలని, ఇంధన పరివర్తన ప్రతి దేశ జాతీయ పరిస్థితులకు అనుగుణంగా, న్యాయబద్ధంగా, సమానత్వంతో జరగాలని ఆయన నొక్కి చెప్పారు.
ముసాయిదా నివేదికలో శిలాజ ఇంధనాల నుంచి వైదొలగే ప్రస్తావన తొలగించడంపై యూరోపియన్ యూనియన్‌తో పాటు పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు, పారిస్ ఒప్పందంలోని నిబంధనల మేరకు అభివృద్ధి చెందిన దేశాల నుంచి స్పష్టమైన ఆర్థిక సహకారం అవసరమని డిమాండ్ చేశాయి. సుదీర్ఘ చర్చలు, అదనపు సమయం పొడిగింపు తర్వాత కూడా తుది ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఓపీ31 సదస్సు చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన వాతావరణ సదస్సులలో ఒకటిగా నిలిచింది.
వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎల్లప్పుడూ క్లైమేట్ జస్టిస్, ఈక్విటీ, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ సూత్రాలకు కట్టుబడి ఉంటుందని భూపేందర్ యాదవ్ పునరుద్ఘాటించారు. తదుపరి వాతావరణ చర్చలలోనైనా అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక మద్దతు అందిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.