వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా, తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో 2030 నాటికి వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు చైనా ప్రభుత్వం కీలక ప్రణాళికను ప్రకటించింది. నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ వెబ్‌సైట్‌లో విడుదలైన ఈ ప్రభుత్వ ప్రణాళికను పౌర వ్యవహారాలు, ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా సంరక్షణ సేవల సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన, సేవల నాణ్యత పెంపుపై ఈ బ్లూప్రింట్ ప్రధానంగా దృష్టి సారించింది. 2025 చివరి నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 323.38 మిలియన్లకు చేరి, మొత్తం జనాభాలో 23 శాతంగా నమోదైన నేపథ్యంలో అందుబాటులో ఉండే, నాణ్యమైన వృద్ధాశ్రమ సేవల అవసరం మరింత పెరిగింది.
వృద్ధుల సంరక్షణ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కొత్త కేంద్రాల నిర్మాణంతో పాటు ఉన్న సౌకర్యాల ఆధునీకరణకు ఈ ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది. 2030 నాటికి వృద్ధాశ్రమ సంస్థలలోని మొత్తం పడకల్లో 73 శాతం నర్సింగ్ కేర్ పడకలు ఉండేలా చూడాలని, కమ్యూనిటీ ఆధారిత వృద్ధ సంరక్షణ కేంద్రాల విస్తరణను 70 శాతానికి చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించింది. శిథిలావస్థలో ఉన్న సుమారు రెండు వేల ప్రభుత్వ వృద్ధాశ్రమ సంస్థల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి, సంరక్షణ ప్రమాణాలు, భద్రతా నిర్వహణను కట్టుదిట్టం చేయనున్నారు. అలాగే నర్సింగ్ హోమ్‌లలో ముందస్తు రుసుములపై కఠిన పర్యవేక్షణ ద్వారా మోసాలను అరికట్టే చర్యలు కూడా చేపట్టనున్నారు.
శిశు సంరక్షణ రంగంలో పిల్లల పెంపకంపై కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక చర్యలు ప్రకటించారు. రెండు నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులకు కూడా సేవలు అందించేలా అర్హత కలిగిన కిండర్‌గార్టెన్లను మార్చుకునేందుకు ప్రోత్సాహం అందించనున్నారు. నివాస ప్రాంతాలకు 15 నిమిషాల ప్రయాణ పరిధిలో నర్సరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా పదిహేను నిమిషాల శిశు సంరక్షణ వ్యవస్థను రూపొందించాలని, కార్యాలయ ప్రాంగణాల్లోనే శిశు సంరక్షణ సేవలు కల్పించేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ నిధులు, స్థానిక సంస్థల ప్రత్యేక బాండ్లు, వాణిజ్య రుణాల ద్వారా ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చనున్నారు.
చైనా జనాభా 2025లో వరుసగా నాలుగో ఏడాది తగ్గగా, జననాల రేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది, 2026లోనూ ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2025 అధికారిక గణాంకాల ప్రకారం చైనాలో వృద్ధుల ఆధారిత నిష్పత్తి తొలిసారిగా పిల్లల ఆధారిత నిష్పత్తిని మించిపోయింది, అంటే శ్రామిక శక్తిపై పిల్లల కంటే వృద్ధుల భారం ఎక్కువైంది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రసూతి, పితృత్వ సెలవుల పెంపు, నవజాత శిశువులకు నగదు ప్రోత్సాహకాలు, ప్రసవ వైద్య ఖర్చుల రాయితీలు, వివాహ నమోదు నిబంధనల సరళీకరణ వంటి చర్యలు చేపట్టినప్పటికీ, జనాభా మార్పులను ఎదుర్కొనేందుకు 2030 లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.