ఏఆర్ రెహమాన్, భరత్ బాలా మరోసారి కలిసి పనిచేసిన వేళ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ దర్శకుడు భరత్ బాలా, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి కలిసి పనిచేసిన చిత్రం బనారస్ 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగానికి ఎంపికై, భారత్‌లో ప్రీమియర్‌కు సిద్ధమైంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, షహానా గోస్వామి, నీరజ్ కబీ, ఛాయా కదమ్, ఇందిరా తివారీ, ఆంటోనితసన్ జేసుతసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బనారస్ సాంస్కృతిక, సంగీత వాతావరణం అలాగే భారతీయ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తరతరాలుగా కొనసాగే సంగీత వారసత్వం, కుటుంబ బంధాలను గంగానది శాశ్వత ఆత్మతో ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మరియన్ చిత్రం తర్వాత పలు లఘు చిత్రాలపై పనిచేసిన తాను, చెప్పాల్సిన కథ దొరికినప్పుడే మళ్లీ ఫీచర్ సినిమా వైపు వస్తానని భరత్ బాలా తెలిపారు. సినిమాల్లో బనారస్‌ను అనేకసార్లు చూపించినప్పటికీ, గంగా తీరంలో వేల ఏళ్ల అనుభవాలతో రూపొందిన ఈ నగరం ఎప్పటికీ కొత్త కోణాలను ఆవిష్కరిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీత సంప్రదాయాలు, రాగాలు, వాటిలోని భావోద్వేగాలు తన సంగీత ప్రస్థానంలో ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చాయని ఏఆర్ రెహమాన్ చెప్పారు. దేశంలోని విభిన్న భాషల ప్రత్యేకత, సాంస్కృతిక అంశాలను తన బాణీల్లో మేళవిస్తానని, అన్ని సంస్కృతులను ఆస్వాదిస్తానని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో తన సంగీతం అందించిన బనారస్, రామాయణ్ చిత్రాలు ప్రదర్శితమవుతుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కాంతి, ఫ్రేమింగ్, కెమెరా కోణాలు, కంపోజిషన్ ద్వారా ప్రేక్షకులను కేవలం వీక్షకులుగా కాకుండా కథలో భాగంగా మార్చేలా పనిచేశామని ఛాయాగ్రాహకుడు మార్క్ కొనింక్స్ వివరించారు. రంగులు, కూర్పుల కలయికతో సంగీతంలా దృశ్య లయను సృష్టించామని, ముఖ్యంగా కుంభమేళా షూటింగ్ సమయంలో రంగుల ఎంపిక కీలకంగా మారిందని చెప్పారు. మతిమరుపు సమస్యతో బాధపడే పాత్రలో నటించిన నీరజ్ కబీ, ఆ పాత్ర ద్వారా బాల్య జ్ఞాపకాలు, వర్తమానం లేదా భవిష్యత్తుపై స్పష్టత లేని స్థితిని అనుభవించానని తెలిపారు.
మహా కుంభమేళాలో భారీ జనసమూహం మధ్య షూటింగ్ చేయడం నియంత్రిత స్టూడియో వాతావరణానికి భిన్నంగా, సవాళ్లతో కూడుకున్నదని అభిషేక్ బెనర్జీ అన్నారు. ఆ అనుభవాన్ని స్ట్రీట్ సినిమాగా అభివర్ణించిన ఆయన, కళాశాల రోజుల్లో చేసిన వీధి నాటకాలను గుర్తుచేసుకున్నారు. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతున్న 57వ ఇఫ్ఫీ స్వదేశీ, విదేశీ చిత్రాలు, చర్చలు, సినీ వేడుకలతో సందడిగా సాగుతోంది.