ఇఫ్ఫీలో బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రౌండ్‌టేబుల్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బ్రిక్స్ దేశాల మధ్య సినీ సహకారాన్ని విస్తరించడంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఉమ్మడి నిర్మాణాలు, పంపిణీ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సాంస్కృతిక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ సినీ అనుబంధాలను బలోపేతం చేయడంపై సినీ రంగ ప్రతినిధులు, దౌత్య అధికారులు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో రష్యా, నైజీరియా, ఇండోనేషియా, ఇరాన్ ప్రతినిధులతో పాటు భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా అధికారులు పాల్గొన్నారు.
దౌత్యపరమైన, సంస్థాగత సంబంధాలకు మించి దేశాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సినిమా చక్కని వేదికగా నిలుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శంభు ఎల్. హక్కి పేర్కొన్నారు. సరిహద్దులు లేని కథలు అనే ఇఫ్ఫీ ఇతివృత్తానికి అనుగుణంగా చిత్రాలు దేశాల సాంస్కృతిక భావాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. చిత్రనిర్మాతలు, పరిశ్రమ భాగస్వాములను అనుసంధానించడంలో ముంబైలోని బ్రిక్స్ వేవ్స్ బజార్ కీలక వేదికగా ఉపయోగపడుతోందని, ఉమ్మడి నిర్మాణాల ద్వారా భాగస్వామ్యాలు, సహకార కథనాలు మరింత బలపడతాయని ఎన్ఎఫ్‌డీసీ ఛైర్మన్ జి. కృష్ణకుమార్ తెలిపారు. విశ్వవ్యాప్త భావోద్వేగాలను పంచే సినిమా శక్తి వల్ల దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, ప్రేక్షకుల మధ్య అవగాహన పెరుగుతుందని ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా సీఈఓ దీపక్ బండేకర్ అభిప్రాయపడ్డారు.
నైజీరియా సినీ పరిశ్రమతో ఉమ్మడి నిర్మాణాలు, పంపిణీ, సాంకేతిక బదిలీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇది యువతకు ఆర్థిక అవకాశాలను కూడా కల్పిస్తుందని భారత్‌లోని నైజీరియా హైకమిషనర్ సయీదు దహిరు ముహమ్మద్ చెప్పారు. భారత్, రష్యా మధ్య ఫిల్మ్ ఫెస్టివల్ మార్పిడులు సాంస్కృతిక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేస్తాయని ముంబైలోని రష్యా తాత్కాలిక కాన్సుల్ జనరల్ అలెగ్జాండర్ ఫర్సోవ్ పేర్కొన్నారు. భారత్, ఇండోనేషియా మధ్య రామాయణ, మహాభారత సంప్రదాయాల సాంస్కృతిక అనుబంధాలను గుర్తుచేస్తూ, ఉమ్మడి నిర్మాణ అవకాశాల కోసం దర్శకనిర్మాతల పర్యటనలు, ఓటీటీ వేదికల ద్వారా సినిమా పంపిణీ, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో సహకారాన్ని ఇండోనేషియా ఫస్ట్ సెక్రటరీ ఎర్నీ వాహ్యుని ప్రతిపాదించారు.
సమాజాలు, ప్రజల జీవన విధానాలను లోతుగా అర్థం చేసుకోవడానికి సినిమా తోడ్పడుతుందని, ఈ చర్చలు సినీ పరిశ్రమలు, సమాజాల మధ్య మరింత విస్తృత సహకారానికి దారితీస్తాయని ఆశిస్తున్నట్లు భారత్‌లోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ముస్తఫా గోహరిఫర్ తెలిపారు. డిజిటల్ టెలివిజన్, ఓటీటీ వేదికల ద్వారా కంటెంట్ మార్పిడి, ఉమ్మడి నిర్మాణాలను మరింత బలోపేతం చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రభాత్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ వేవ్స్ బజార్‌లో అంతర్జాతీయ సహ నిర్మాణాలు, కృత్రిమ మేధస్సు, యానిమేషన్, గేమింగ్, మహిళా నాయకత్వంపై జరిగిన చర్చలను ఆయన ప్రస్తావించారు. ఉత్సవాల్లో పాల్గొంటున్న బ్రిక్స్ దేశాల చిత్రాల ప్రదర్శన వీడియోతో సమావేశం ముగిసింది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో సాగుతున్న ఈ ఉత్సవాలు అంతర్జాతీయ సినీ ప్రముఖుల చర్చలు, ప్రదర్శనలతో కొనసాగుతున్నాయి.