సినిమా నేర్పవచ్చా లేక స్వయంగా ఆవిష్కరించుకోవాలా..
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సినిమా నిర్మాణ కళను నేర్పవచ్చా లేక స్వయంగా ఆవిష్కరించుకోవాలా అనే అంశంపై సినీ ప్రముఖులు ఆసక్తికర చర్చ నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ప్యానెల్ చర్చలో నటుడు అనుపమ్ ఖేర్, నటి, దర్శకురాలు అమల అక్కినేని, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ భూపేంద్ర కైంతోలా, ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస, వార్సా ఫిల్మ్ స్కూల్ ప్రతినిధి ఆర్టుర్ డబోర్స్కీ పాల్గొన్నారు. విక్రమ్‌జిత్ రాయ్ ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో పొందిన శిక్షణ తన నటనా ప్రస్థానాన్ని ఎలా తీర్చిదిద్దిందో అనుపమ్ ఖేర్ వివరించారు. 28 ఏళ్ల వయసులో తొలి చిత్రం సారాంశ్‌లో 65 ఏళ్ల వృద్ధుడి పాత్రను పోషించగలిగేలా ఆ శిక్షణ ఎంతో తోడ్పడిందని గుర్తు చేసుకున్నారు. పరిశీలన, కల్పనా శక్తి, భావోద్వేగ జ్ఞాపకాలు నటుడికి అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, రోజువారీ అనుభవాల నుంచి నేర్చుకుంటూ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
కళాత్మక అంతర్దృష్టికి, సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య ఉన్న తేడాను భూపేంద్ర కైంతోలా స్పష్టం చేశారు. కళను ఆవిష్కరించుకోవచ్చని, కానీ నైపుణ్యాన్ని మాత్రం నేర్పించాల్సి ఉంటుందని అన్నారు. సృజనాత్మక ఆలోచనలను సినిమాలుగా మలచడానికి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రక్రియలు అవసరమని చెప్పారు. మరోవైపు సినిమా నిర్మాణంలో విభిన్న విభాగాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఫిల్మ్ స్కూళ్లు దోహదపడతాయని అమల అక్కినేని పేర్కొన్నారు. మూస ధోరణులను అధిగమించి, మరిన్ని మంది మహిళలు సినిమా విద్య వైపు వచ్చేలా ప్రోత్సహించాలని విద్యావేత్తలను కోరారు.
ప్రపంచ సినిమా గురించి తెలుసుకోవడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఫిల్మ్ ఫెస్టివళ్లు, ఫిల్మ్ స్కూళ్లు తోడ్పడతాయని ఆర్టుర్ డబోర్స్కీ అన్నారు. ప్రాజెక్టులకు నిధుల సమీకరణ వంటి వ్యాపార కోణంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. షూటింగ్ సెట్లలో సమయం, వనరుల పరిమితుల దృష్ట్యా సాంకేతిక ప్రాథమికాంశాలు, బృంద కృషి, నిర్మాణ నిర్వహణ నేర్చుకోవడానికి ఫిల్మ్ స్కూళ్లు చక్కని వేదిక అని మనోజ్ పరమహంస అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధస్సుతో పునరావృత పనులు, స్టోరీబోర్డింగ్ వేగవంతమవుతున్నప్పటికీ, నటనలో మానవ భావోద్వేగాల లోతును సాంకేతికత భర్తీ చేయలేదని అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతున్న ఈ ఉత్సవాలు సినీ ప్రియులు, నిపుణులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.