ఇఫ్ఫీలో బ్రిక్స్ చిత్రోత్సవానికి శ్రీకారం చుట్టిన రామాయణ
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ విభాగం ప్రారంభ చిత్రంగా దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ పార్ట్ 1 ప్రదర్శితమైంది. ఆదివారం ఉత్సవాల మూడో రోజున ఈ చిత్రం ప్రీమియర్ షో వేయడంతో భారత ఇతిహాస కథాంశం అంతర్జాతీయ సినిమా వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల సినీ వైభవాన్ని చాటిచెప్పే ఫిల్మ్స్ ఫ్రమ్ బ్రిక్స్ విభాగానికి ఈ చిత్రం ప్రారంభోత్సవం చేయడం విశేషంగా నిలిచింది.
ప్రారంభ వేడుకలో ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దర్శకుడు నితీష్ తివారీని ఘనంగా సత్కరించారు. ఈ విభాగపు ప్రారంభ చిత్రంగా నిలిచినందుకు ఆయన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నైజీరియా, ఇండోనేషియా, రష్యా, ఇరాన్ దేశాల దౌత్య ప్రతినిధులతో పాటు పలు సాంస్కృతిక, దౌత్య సంస్థల ప్రతినిధులు పాల్గొని సత్కారాలు అందుకున్నారు.
ఫిల్మ్స్ ఫ్రమ్ బ్రిక్స్ విభాగంలో పదకొండు సభ్య దేశాలు, పది భాగస్వామ్య దేశాల నుంచి వచ్చిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. విభిన్న భాషలు, శైలులు, సాంస్కృతిక నేపథ్యాలతో రూపొందిన ఈ చిత్రాలు కుటుంబ జ్ఞాపకాలు, సామాజిక ఒత్తిళ్లు, పట్టుదల, పర్యావరణ అనుబంధం వంటి ఇతివృత్తాలను స్పృశిస్తున్నాయి. ఈ విభాగంలో అమాడియో అండ్ ద హైపోథెటికల్ న్యూ వరల్డ్, 1982, నైన్ టెంపుల్స్ టు హెవెన్, అండ్ ద స్నో వాజ్ ఫాలింగ్, బాబ్, బాగా: టుమారో బిలాంగ్స్ టు నో వన్, బరాకోవా, బో బో, కాటన్, డ్రీమింగ్ ఆఫ్ సెరెనాడా వంటి చిత్రాలు కూడా చోటు చేసుకున్నాయి.
భిన్న సమాజాల అనుభవాలను, సమకాలీన కథన సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సినిమా ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, సహకారాన్ని పెంపొందించడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి మానవ అనుభవాలను విభిన్న కోణాల్లో ఆవిష్కరిస్తూ అంతర్జాతీయ సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఈ చిత్రోత్సవాన్ని తీర్చిదిద్దారు.