నవంబర్ 25న నయీ చేతన ఐదో ఎడిషన్ ప్రారంభం
సూర్య జాతీయ డెస్క్: మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 25న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ జెండర్ క్యాంపెయిన్ నయీ చేతన ఐదో ఎడిషన్ను ప్రారంభించనుంది. నయీ చేతన – పహల్ బద్లావ్ కీ పేరుతో సాగే ఈ విడతలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం, భద్రత, స్వయం నిర్ణయాధికారాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఆధ్వర్యంలో 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, క్రమంగా లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడం, వివక్షాపూరిత సామాజిక ఆచారాలను ప్రశ్నించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దేశవ్యాప్త సమష్టి ఉద్యమంగా ఎదిగింది.
ఐదో ఎడిషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కమ్యూనిటీ సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వివక్షాపూరిత సామాజిక ధోరణులను మార్చడం, సమానత్వం, భాగస్వామ్య బాధ్యతలను పెంపొందించడంలో పురుషులు, బాలురు, యువత చురుకైన భాగస్వామ్యాన్ని కూడా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, క్లస్టర్ స్థాయి సమాఖ్యలు, జెండర్ రిసోర్స్ సెంటర్ల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని సమీకరిస్తూ కార్యక్రమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఈ జాతీయ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నయీ చేతన 4.0 అసెస్మెంట్ నివేదికను విడుదల చేయనున్నారు. గత విడత పనితీరు, అందిన కీలక పాఠాలను ఈ నివేదిక విశ్లేషించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాగే లింగ సమానత్వం దిశగా విజయవంతంగా సాగుతున్న కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు, ఉత్తమ ఆచరణలను తెలియజేసే రాష్ట్రస్థాయి వీడియోలు, ప్రజెంటేషన్లను ప్రదర్శించడంతో పాటు ప్రచారం కోసం రూపొందించిన వీడియో వనరులను కూడా ఆవిష్కరించనున్నారు.
హింస రహిత గ్రామ చొరవకు సంబంధించిన చతుర్పాక్షిక అవగాహన ఒప్పందాన్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక ప్రగతిలో మహిళల కృషిని గుర్తిస్తూ, వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రచారం ముందుకు సాగుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాబోయే నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్య కార్యక్రమాలు, క్షేత్రస్థాయి చొరవలతో మహిళలకు స్థానిక ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత బలం చేకూరనుంది.