telangana
వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వివోఏలకు కనీస వేతనం ఇవ్వాలని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు మారి పెళ్ళ మాధవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రధాన కార్యదర్శి పట్టారి తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ మోహినుద్దీన్ కోశాధికారి ఏర్పుల నరసింహుల తో కలిసి ఆమె మాట్లాడారు. ప్రస్తుతము ఉన్న గౌరవ వేతనం రూ. 5000 ను 10 వేల కు పెంచుతామని ప్రస్తుత మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో సైతం ఈ హామీని చేర్చినట్లు చెప్పారు . అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన ఇంతవరకు హామీ మేరకు తమ వేతనాలు పెంచలేదని ఆవేదన చెందారు. చాలీచాలని వేతనం కారణంగా ఒంటరి మహిళలకు పెన్షన్ సైతం అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వివోఏ లపై అధికారులు, రాజకీయ నాయకుల లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని సూచించారు. ఐసిడిఎస్ మాధురి సెర్పులో కూడా అధికారులుగా మహిళలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెల రోజుల్లో నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పోలు దాసరి రమేష్, కన్నం శారద, సహాయ కార్యదర్శి బొమ్మరపు అనురాధ, మేడారం రాజ్యలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కమ్మరి కృష్ణ, సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు