telangana
కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :కమ్యూనిస్టు పార్టీలన్నీ విభేదాలు, అహంభావాలను పక్కనపెట్టి ఐక్యమై ప్రజల హక్కుల కోసం, సమాజ మార్పు కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సినీ నటుడు మాదాల రవి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికల్లో సామాన్య ప్రజలకు ఏం చేస్తామో స్పష్టంగా వివరించి, తమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై వామపక్ష పార్టీలు దృష్టి సారించాలని సూచించారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యవేదిక (యూఎల్‌డీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో జస్టిస్ బి. చంద్రకుమార్ రచించిన ‘ఈ దేశం కోసం.. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలి’ పుస్తకాన్ని మాదాల రవి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయని, మన దేశంలో మాత్రం వామపక్ష శక్తులు అనేక పార్టీలుగా విడిపోవడం విచారకరమన్నారు. శ్రమజీవులు సృష్టించే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్న నేపథ్యంలో ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు కమ్యూనిస్టు శక్తుల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. మాదాల రంగారావు తన సినిమాల ద్వారా కమ్యూనిస్టు ఐక్యత ఆవశ్యకతను చాటారని, ‘మరో కురుక్షేత్రం’ చిత్రంలో నాలుగు కమ్యూనిస్టు పార్టీలుగా విడిపోయిన సోదరులు తిరిగి ఐక్యమైతేనే దేశం ముందుకు సాగుతుందనే సందేశాన్ని అందించారని గుర్తుచేశారు. కళ కేవలం వినోదం, డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా సామాజిక చైతన్యానికి సాధనంగా మారాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ‘మా భూమి’ నాటకం ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం విద్య వ్యాపారంగా మారిందని, వైద్యం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి సామాన్యులకు భారంగా మారిందని విమర్శించారు. సినిమా రంగంలో హింసను హీరోయిజంగా చూపించడం సరికాదని, వెయ్యిమందిని చంపేవాడు హీరో కాదని, వెయ్యిమంది కోసం తన ప్రాణాలను త్యాగం చేసేవాడే నిజమైన హీరో అని వ్యాఖ్యానించారు. కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్ష ఐక్య ఉద్యమాలు రాజకీయంగా ప్రభావం చూపిన విషయాన్ని గుర్తుచేస్తూ, రాజకీయ పోరాటాలతోపాటు సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయాలని సూచించారు. కళాకారులు, రచయితలు, నటులు, ప్రజా సంఘాలు, అభ్యుదయ శక్తులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. గతంలో కార్మిక ఐక్యత కోసం ఇచ్చిన ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. సంకెళ్లు తప్ప కోల్పోయేదేమీ లేదు’ అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ, నేడు ‘భారత కమ్యూనిస్టులారా ఏకంకండి.. అహంభావాలు తప్ప కోల్పోయేదేమీ లేదు’ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జస్టిస్ బి. చంద్రకుమార్ మాట్లాడుతూ విద్య, వైద్యం, న్యాయం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటంతోపాటు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిచ్చే సమాజ నిర్మాణమే యూఎల్‌డీఎఫ్ లక్ష్యమని తెలిపారు. రాజకీయ పార్టీలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఐక్యవేదిక ఏర్పాటైందన్నారు. గత విభేదాలు, పరస్పర విమర్శలను పక్కనపెట్టి ఐక్యతకు ప్రాధాన్యమివ్వాలని, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, బీసీ సంఘాలతోపాటు అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, మానవీయ విలువల క్షీణతను అరికట్టి ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఎల్‌డీఎఫ్ కో-కన్వీనర్ ఎం. వెంకటదాస్, పుస్తక రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రేఖ చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు కందిమల్ల ప్రతాపరెడ్డి, ఆంధ్రప్రదేశ్ యూఎల్‌డీఎఫ్ కన్వీనర్ ఎం. వెంకయ్య, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదెబోధి రవి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కె. గోవర్ధన్, ఆర్‌ఎస్‌పీ నాయకుడు జానకిరాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా, ఏఐడబ్ల్యూపీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపండి పాండురంగాచారి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కె. రమ, తహ్రీక్ ముస్లిం షబాన్ అధ్యక్షుడు అబ్దుల్ హక్ ఖమర్, మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ అజీజ్, న్యూడెమోక్రసీ నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.