telangana
రమణీయం… రథోత్సవం…గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం
సూర్య,భీమ్గల్ : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం భక్తజనుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.నవంబర్ 15 నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం అత్యంత విశిష్టమైన ఘట్టంగా నిలిచింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి కుటుంబీకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ రథ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. గరుత్మంతుడు, వాయుపుత్రుడు తదితర దేవతా శక్తులను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలు, విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వర్ణాభరణాలతో అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టదిక్పాలకులకు బలి ప్రధానం నిర్వహించిన అనంతరం గోవిందా.. గోవిందా అంటూ భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
**దర్శనానికి బారులు తీరిన భక్తులు**
రథోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు గర్భాలయంలో కొలువైన స్వర్ణాలంకార భూషితుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ, స్వర్ణాభరణాలతో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల కొంగు బంగారంగా కొలువైన నరసింహుని దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.
**ఆధ్యాత్మిక శోభతో నింబాచలం**
కార్తీక మాస పవిత్రతకు ప్రతీకగా నిలిచిన ఈ బ్రహ్మోత్సవాలు నింబాచల క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. కొండపై ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, హరినామస్మరణలు, భజనలు, మంగళవాయిద్యాల నాదాలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. స్వామివారి రథాన్ని దర్శించుకోవడం, రథోత్సవంలో పాల్గొనడం పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన ఈ వేడుక నింబాచల క్షేత్రంలో పండుగ వాతావరణాన్ని నింపింది.
**పటిష్ట పోలీసు బందోబస్తు**
రథోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గర్భాలయ మెట్ల మార్గం వద్ద భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవం ప్రశాంతంగా ముగిసే వరకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించారు.
*జాతర లో ప్రముఖులు*
జగన్నాయకుని రథయాత్ర లో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, స్టేట్ మినరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, బీజేపీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.