శ్రీకాళహస్తి పట్టణం శుకబ్రహ్మ ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ధాత్రి ఉత్సవం ఉసిరికాయ చెట్టు క్రింద పరమేశ్వరుని పూజ అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నులపండువగా జరిగింది. పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వామివారి దివ్య ఆశీస్సులతో, సర్వాత్మానంద స్వామివారు ఉసిరి చెట్టు కింద కొలువై ఉన్న పరమేశ్వరునికి వేదోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య శివ అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్ప సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ శుక బ్రహ్మాశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వాములు ఆధ్వర్యంలో సుమారు 500 మంది మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేయగా, ఆశ్రమ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో, శివనామస్మరణతో మారుమోగింది. అనంతరం అన్నమయ్య కీర్తనలు, శివ భజనలతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. తదనంతరం సుమారు 500 మందికి పైగా భక్తులకు కార్తీక వనభోజనం, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు భక్తవత్సల నాయుడు, గుమ్మళ్ల రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, వేమన పద్యాల వక్త అక్బర్ బాషా, ఆశ్రమ మేనేజర్, ఆశ్రమ వాసులు రవి, దొరబాబుతో పాటు సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు, భక్తులు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి