telangana
ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్ హరగోపాల్
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :ప్రభుత్వరంగ సంస్థలు కేవలం లాభనష్టాల ప్రాతిపదికన పనిచేసేవి కావని, ప్రజల అవసరాలను తీర్చే సేవా సంస్థలుగా వాటిని పరిగణించాలని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల వేతనాలు, సేవా నిబంధనలు ప్రైవేటు రంగానికి ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు అసమర్థమైనవని, పోటీ లేకపోతే సమర్థంగా పనిచేయవని ప్రచారం చేస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు భారీ పెట్టుబడులు పెట్టే సామర్థ్యం లేకపోవడంతో ప్రభుత్వమే పారిశ్రామికాభివృద్ధి బాధ్యతను చేపట్టిందని వివరించారు. ఉక్కు, సిమెంట్ పరిశ్రమల స్థాపనతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వరంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయని, ప్రైవేటు పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవసరమైన పునాదులను సైతం ప్రభుత్వరంగమే నిర్మించిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రారంభమైన విధానాలు క్రమంగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ దిశగా మారాయని అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను అసమర్థమైనవిగా పేర్కొంటూ ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వాలు, ప్రస్తుతం లాభాలు ఆర్జిస్తున్న సంస్థలను సైతం విక్రయిస్తుండటాన్ని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థల పాత్రను తగ్గించి అంతర్జాతీయ, కార్పొరేట్ పెట్టుబడులకు ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వడం ఆందోళనకరమన్నారు. బాల కార్మికత్వంపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరిగిన చర్చను ప్రస్తావిస్తూ, ఆర్థికాభివృద్ధిలో బాల కార్మికులు కూడా ఒక ఇన్‌పుట్ అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. బాల కార్మికత్వం లేకుండా దేశం అభివృద్ధి చెందదనే ఆలోచనను అంగీకరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల పేరుతో పార్లమెంటు ఆమోదం లేని విధానాలను అమలు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనపెట్టడం తగదని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రజల ఆస్తులుగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రచించిన ‘కార్పొరేట్ల ప్రబంధ హస్తాల్లోకి ప్రభుత్వ రంగం’, ‘జీవించే హక్కుకై’ పుస్తకాల ఆవిష్కరణ సభ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ రెండు పుస్తకాలను ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వీ. కృష్ణ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విప్లవ రచయిత, ‘వీక్షణం’ పత్రిక సంపాదకుడు కామ్రేడ్ వేణుగోపాల్, ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ప్రదీప్, ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, రచయిత ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.