భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం.
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం.
బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం చెక్కు అందజేత
రొంపిచెర్ల, మేజర్ న్యూస్:
ఆపద సమయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేలా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం అండగా నిలిచింది. రొంపిచెర్ల లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన వేణుగోపాల్, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ ఇటీవల తిరుపతిలో దారుణ హత్యకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె క్రెడిట్ కార్డుల విభాగంలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవారు. భాగ్యశ్రీకి రొంపిచెర్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉండగా, ప్రతి నెలా ఆమె జీతం అదే ఖాతాలో జమయ్యేది. ఈ క్రమంలో ఆమె ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో చేరి, ఏటా రూ.436 ప్రీమియం చెల్లిస్తూ తన తండ్రి వేణుగోపాల్‌ను నామినీగా ఉంచారు. అక్టోబర్ 31వ తేదీన భాగ్యశ్రీ మరణించడంతో, బీమా పథకం కింద మంజూరైన రూ.2 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కును రొంపిచెర్ల స్టేట్ బ్యాంక్ శాఖ మేనేజర్ రవికుమార్ బాధితురాలి తండ్రి వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాతో పాటు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో చేరి ఆర్థిక భద్రత పొందాలని సూచించారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను బ్యాంకులో లేదా స్టేట్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్‌లో సమర్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ద్వారకానాథ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, హేమసుందర్, గహిదుల్లా బేగ్, బావాజీ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.