పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శ్రీజిత్ రవికి పోక్సో (POCSO) కేసులో కేరళ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం త్రిశూర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు నిందితుడికి 50 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని బాధిత ఇద్దరు బాలికలకు సమానంగా నష్టపరిహారంగా అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
2022 జులై 4వ తేదీన త్రిశూర్‌లోని అయ్యంతోల్ మైదానం సమీపంలో పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు మైనర్ బాలికల ఎదుట శ్రీజిత్ రవి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి అప్పట్లో ఆయనను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో తనకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి చికిత్స పొందుతున్నానని శ్రీజిత్ రవి తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అంతేకాకుండా ఈ కేసు కారణంగా ఆయన సినీ కెరీర్ దెబ్బతిన్నదని, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పేర్కొంటూ శిక్ష తగ్గించాలని అభ్యర్థించారు.
అయితే డిఫెన్స్ వాదనలను న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు తీవ్రంగా పరిగణించింది. విచారణలో భాగంగా 21 మంది సాక్షులను పరిశీలించిన న్యాయస్థానం, బాధిత బాలికలు మొదటి నుంచి నిందితుడిని స్పష్టంగా గుర్తించారని, వారి వాంగ్మూలాలు విశ్వసనీయంగా ఉన్నాయని పేర్కొంటూ శ్రీజిత్ రవిని దోషిగా నిర్ధారించింది. కాగా, ఈ తీర్పుపై కేరళ హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీజిత్ రవి కోరడంతో, కోర్టు ఆయన శిక్షను నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ, డిసెంబర్ 23న తిరిగి కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
సీనియర్ మలయాళ నటుడు టి.జి. రవి కుమారుడైన శ్రీజిత్ రవి 2005లో సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటివరకు మలయాళం, తమిళ భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్ పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈ తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో కూడా 2016లో ఇలాంటి ఆరోపణలతోనే ఆయన వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. తాజా కోర్టు తీర్పుతో దక్షిణాది సినీ వర్గాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Also Read: చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్