చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో మెగాస్టార్ చిరంజీవి పేరులో ఎన్ (N) అక్షరం లేకుండా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు చిరంజీవి పేరులో ఆ అక్షరం ఎందుకు మాయమైందన్న సస్పెన్స్‌కు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మంగళవారం తెరదించింది. మిస్ అయిన ఆ ఎన్ అక్షరం నెట్‌ఫ్లిక్స్ లోగోకు సంకేతమని స్పష్టం చేస్తూ, చిరంజీవి మొట్టమొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించనున్న సెలబ్రిటీ టాక్ షో చిరంజీవిస్ మెగావర్స్ (Chiranjeevi’s Megaverse) అధికారిక ప్రోమోను విడుదల చేసింది.
దీంతో మెగా అభిమానులు ఊహించినట్లే ఓటీటీ వేదికగా ఒక భారీ మెగా కొలాబరేషన్ కుదిరిందని అధికారికంగా ఖరారైంది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ ప్రత్యేక ప్రోమో వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. నగరంలోని కొబ్బరిబొండాల వ్యాపారి, ఆటో డ్రైవర్, యువత, అభిమానుల చేతులపై ఉన్న పచ్చబొట్లు, టీ-షర్టులు, హోర్డింగ్స్ ఇలా ఎక్కడ చూసినా చిరంజీవి పేరులో ఎన్ అక్షరం లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నట్లు చూపించారు. చివర్లో ఎర్రటి లెదర్ కుర్చీలో రాయల్‌గా కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి స్మార్ట్‌ఫోన్ తెరపై ప్రత్యక్షమై, తనదైన స్వాగ్‌తో నెట్‌ఫ్లిక్స్ లోగో రూపంలోని ఎన్ అక్షరాన్ని తన పేరులో చేరుస్తారు.
ఇది నా అడ్డా అంటూ తన మార్క్ డైలాగ్‌తో చిరంజీవి పలికిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెండితెరపై సుమారు ఐదు దశాబ్దాల పాటు తన నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి, గతంలో బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో హోస్ట్‌గా మెప్పించారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఓటీటీ వేదికపై చిరంజీవిస్ మెగావర్స్ ద్వారా తన సినీ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలు, తెరవెనుక ఆసక్తికర విశేషాలను సినీ ప్రముఖులతో కలిసి పంచుకోనున్నారు. ఈ సెలబ్రిటీ టాక్ షోలో లోకనాయకుడు కమల్ హాసన్, కింగ్ నాగార్జున, రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతో పాటు ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, బాబీ కొల్లి తదితరులు అతిథులుగా పాల్గొననున్నట్లు సమాచారం.
మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు అన్నీ ఒకే చోట ఉండబోతున్నాయని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్, ఈ షో ప్రారంభోత్సవాన్ని నవంబర్ 30న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే వేదికపై ఈ టాక్ షో స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. మరోవైపు సినిమాల పరంగా చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరతో పాటు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.