telangana
కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత
జగిత్యాల, నవంబర్ 24: కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
క్యూలైన్లలో భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలాసేపు వేచి చూసినా దర్శనం ముందుకు సాగకపోవడం, ఆలస్యం కావడంతో భక్తుల్లో అసహనం పెరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు బారికేడ్లను విరగ్గొట్టి వేల సంఖ్యలో ఒక్కసారిగా ఆలయంలోకి చొచ్చుకుపోయారు.
పరిస్థితి చేయి దాటిపోతుండటం, ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా ఆలయ ప్రధాన ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భక్తులను నియంత్రించి, క్యూలైన్లను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.