అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే లక్ష్యం
సూర్య జగిత్యాల ప్రతినిధి:అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో నూతనంగా మంజూరైన 735 ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. గొల్లపల్లి మండలంలో గతంలో 9,336 మంది పెన్షన్లు పొందుతుండగా, తాజాగా మరో 735 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో మొత్తం 10,071 కుటుంబాలకు చేయూత అందుతోందని పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లలో 339 మంది వితంతువులు, 143 మంది దివ్యాంగులు, 105 మంది కల్లుగీత కార్మికులు, 81 మంది ఒంటరి మహిళలు, 46 మంది ఫైలేరియా బాధితులు, 21 మంది చేనేత కార్మికులు ఉన్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రఘువరన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.