జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక
సూర్య జాతీయ డెస్క్: శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా నవంబర్ 26న నిర్వహించే జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు బిహార్ రాజధాని పాట్నా వేదిక కానుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పలు కీలక డెయిరీ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పాడి సేకరణ, ప్రాసెసింగ్, పశుపోషణ, పర్యావరణ హిత నిర్వహణను బలోపేతం చేసేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్ కింద డెయిరీ సహకార సంఘాలకు డేటా ప్రాసెసింగ్ అండ్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల పంపిణీతో పాటు, పాట్నాలోని వీపీఎంయూ, ముజఫర్‌పూర్‌లోని టీముల వద్ద మినరల్ మిక్చర్ ప్లాంట్లను జాతికి అంకితం చేయనున్నారు. సమస్తిపూర్‌లోని మిథిలా మిల్క్ యూనియన్ వద్ద ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. అలాగే యానిమల్ హస్బెండ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ సహకారంతో పాట్నా జిల్లా బిహ్తా సమీపంలోని సికందర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన నమస్తే ఇండియాకు చెందిన రోజుకు రెండు లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద మంజూరైన వెటర్నరీ మెడిసిన్ సేల్స్ సెంటర్ల ధ్రువపత్రాలను పంపిణీ చేయనున్నారు. దీనితో పాటు పశుసంవర్ధక, పాడి రంగాలకు వాతావరణాన్ని తట్టుకునే సమగ్ర రోడ్‌మ్యాప్, బేసిక్ యానిమల్ హస్బెండ్రీ స్టాటిస్టిక్స్ 2026 నివేదికను విడుదల చేయనున్నారు. డెయిరీ సహకార సంఘాలు, మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల పనితీరు, పారదర్శకతను పెంచేందుకు రేటింగ్, గ్రేడింగ్ ప్రమాణాలతో కూడిన ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించనున్నారు.
ఈ వేడుకల్లో జాతీయ గోపాల రత్న అవార్డులు 2026 ప్రదానం చేయడంతో పాటు, సుధా బ్రాండ్ మఖానా ఖీర్, రబ్రీ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నారు. పాడి రైతులతో ముఖాముఖి సంభాషణ నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సహాయ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్, బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర మంత్రి నంద్ కిషోర్ రామ్ తదితరులు పాల్గొననున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా పాడి రంగంలో సుస్థిర, సమగ్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.