ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత
సూర్య జాతీయ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం ఈ సీజన్‌లోనే అత్యంత చల్లని ఉదయాన్ని ఢిల్లీ వాసులు ఎదుర్కొన్నారు. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. ప్రధాన వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్‌లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 1.3 డిగ్రీలు తక్కువగా ఉండగా, అంతకుముందు రోజుతో పోలిస్తే 1.2 డిగ్రీలు తగ్గింది.
చలి గాలులు, పొగమంచు ప్రభావంతో ఉదయం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గింది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లే ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ప్రజలు చలి నుంచి రక్షణ చర్యలపై దృష్టి సారిస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత ఇంకా పేలవమైన స్థితిలోనే కొనసాగుతోంది. నగర సగటు వాయు నాణ్యత సూచీ 224గా నమోదైంది. పలు పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యత క్షీణించగా, నాలుగు కేంద్రాల్లో అత్యంత పేలవమైన స్థాయిలో నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.
చలి తీవ్రతతో పాటు గాలి కాలుష్యం తోడవడంతో శ్వాసకోస సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేళల్లో ఆరుబయట వ్యాయామాలు, నడక వంటి కార్యకలాపాలను తగ్గించుకోవడం మంచిదని అధికారులు హితవు పలుకుతున్నారు.