బాలి యాత్ర 2026 వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము
సూర్య జాతీయ డెస్క్: ఒడిశాలోని కటక్‌లో మంగళవారం నిర్వహించిన బాలి యాత్ర 2026 ఉత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రాచీన ఒడిశా నౌకా వర్తకుల ధైర్యసాహసాలు, నైపుణ్యం, వాణిజ్య చొరవ నుంచి ప్రస్తుత తరం, ముఖ్యంగా యువత స్ఫూర్తి పొంది ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒడిశా ఘనమైన చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక పండుగగా బాలి యాత్రను అభివర్ణించిన రాష్ట్రపతి, సముద్ర వాణిజ్య చరిత్ర కాలక్రమేణా సంప్రదాయంగా మారి పండుగ రూపం సంతరించుకోవడం ఒడిశా ప్రజల సృజనాత్మకత, చారిత్రక దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఒడిశా నౌకా వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర వర్తకులు సుదూర ప్రాంతాలకు సముద్ర ప్రయాణాలు చేసి వాణిజ్య వ్యాపారాలు నిర్వహించారని ద్రౌపది ముర్ము వివరించారు. కొత్త సముద్ర మార్గాలను అన్వేషించడం ద్వారా అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేశారని, సాంస్కృతిక మార్పిడులకు దోహదపడి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఒడిశా, బాలి మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు ప్రస్తుత కాలానికి తగిన వాణిజ్య, సాంస్కృతిక సహకారానికి విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది బాలి యాత్రలో ఇండోనేషియా నుంచి వచ్చిన సాంస్కృతిక బృందాల భాగస్వామ్యాన్ని ఆమె ఆహ్వానించారు.
బాలిలో రెండు రోజుల పాటు ఒడిశా ఉత్సవం జరుగుతోందని, ఇందులో ఒడిశా నృత్య సంగీతాలతో పాటు చేనేత, హస్తకళలు, సంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తున్నారని రాష్ట్రపతి ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాలు భారత్, ఇండోనేషియా మధ్య చారిత్రక బంధాలను మరింత పటిష్టం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గతాన్ని గర్వంగా స్మరించుకుంటూనే, వర్తమానాన్ని తీర్చిదిద్దుకోవడానికి, భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చుకోవడానికి చారిత్రక వారసత్వం నుంచి స్ఫూర్తి తీసుకోవాలని సూచించారు.
వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం వేగంగా సాగుతోందని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ఠ పెరిగిందని, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనిశ్చితి, ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా నిలబడిందని చెప్పారు. ఇది అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రయాణానికి శుభసూచకమని తెలిపారు. మరోవైపు ఒడిశా పారిశ్రామిక కేంద్రంగా ఎదిగి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, చేనేత కార్మికులు, యువత తమ నైపుణ్యాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, ఇది వికసిత్ ఒడిశా కలను సాకారం చేసే దిశగా ఆశాజనక పరిణామమని రాష్ట్రపతి పేర్కొన్నారు.