కార్తీక పౌర్ణమి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, మేజర్ న్యూస్: అనంతగిరి కొండపై వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి కార్తీక మాస జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమాల్లో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న స్పీకర్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొన్న స్పీకర్ స్వయంగా రథాన్ని లాగి భక్తులతో కలిసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాస జాతరలో భాగంగా రథోత్సవం రోజున స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలతో పాటు వికారాబాద్ నియోజకవర్గ, పట్టణ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేష్, పీఏసీఎస్ చైర్మన్ బి.రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ ఎన్. పద్మనాభం, ఈఓ టి. నరేందర్, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.