శ్రీవారికి భారీ బంగారు కానుక.. సీఎం చంద్రబాబు సమక్షంలో 121 కిలోల ఆభరణాల సమర్పణ
అమరావతి/తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక భక్తుడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందజేయనున్నారు.
ఈ పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి ఉదయం 8:30 గంటలకు అమరావతి నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి, 10:00 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10:45 గంటలకు తిరుమలలోని గాయత్రీ నిలయానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో సీఎం సమక్షంలో దాత ఈ బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులకు అధికారికంగా అప్పగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.