మధ్యప్రదేశ్‌లో 223 వంతెనలకు రూ.643.14 కోట్ల ఆమోదం
సూర్య జాతీయ డెస్క్: మధ్యప్రదేశ్‌లో 223 వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.643.14 కోట్ల నిధులకు బుధవారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే పలు కీలక అంశాలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఐదల్ సింగ్ కన్సనాతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
రహదారులు, వంతెనలు, గృహనిర్మాణం, నీటిపారుదల మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో సమీక్షించారు. వంతెనల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపడం వల్ల రాష్ట్రంలో గ్రామీణ రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. దీనితో పాటు సుమారు రూ.600 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్రతిపాదనలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించి చర్చించారు.
వ్యవసాయ రంగంలో రైతులకు మరింత తోడ్పాటు అందించడం, సాగునీటి వసతులను విస్తరించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు.