అభివృద్ధిపై చర్చకు సిద్ధం
హనుమకొండ, మేజర్ న్యూస్, అభివృద్ధిపై చర్చకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని, రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు.బుధవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధి పనులపై చర్చించేందుకు చౌరస్తాకు రావాలని సవాల్ విసిరితే, బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నించారు. నియోజవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రజాస్వామ్య బద్ధంగా విసిరిన సవాలకు సమాధానం చెప్పలేక బిఆర్ ఎస్ శ్రేణులు దాడులకు, ఉద్రిక్తతలకు తెర లేపడం వంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారం ఉండి రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన బి ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపించారని తెలిపారు. 500 రోజులు కాదు కదా, మరో ఐదు వేల రోజులైనా కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పదేళ్లపాటు పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు అప్పుడు గుర్తుకు రాని వరంగల్ అభివృద్ధి ఇప్పుడు అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. వరంగల్ ఫ్యూచర్ సిటీని చేస్తానని కేటీఆర్ కబుర్లు చెబుతున్నారని, పదేళ్లలో బడ్జెట్ లో అంకెల గారడి తప్ప వరంగల్ కు ఏం చేశారో చెప్పే దమ్ము లేకనే బిఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టి కాంగ్రెస్ క్యాంపు కార్యాలయం పై దాడులు చేయించారని మండిపడ్డారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరితే సమాధానం చెప్పలేక దాడులకు దిగడం కేటీఆర్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
కేటీఆర్ వరంగల్‌కు వచ్చింది ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గత పదేళ్ల పాలనలో నగరాన్ని అభివృద్ధి చేయకుండా అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. సెంట్రల్ జైలును కూల్చి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూశారని, సరైన ప్రణాళిక లేకుండా ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని విమర్శించారు. నగరంలో విద్యాసంస్థల నిర్మాణాలను కూడా మధ్యలోనే వదిలేశారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు.కనీసం పార్కింగ్ వసతి లేకుండా కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే పూర్తి వసతులు ఉండేలా నిర్మాణం చేపట్టామని,ఆనాడు మీ హయాంలో చేసిన తీర్మానంలో కాళోజీ కళాక్షేత్రం ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన నిర్ణయం తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.ఇందులో ఎలాంటి కబ్జాలకు తావులేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఒక్క కబ్జా ఆరోపణనైనా ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూములు దోపిడీకి గురయ్యాయని, పేపర్ లీకేజీలకు కూడా అప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను పక్కన పెట్టారని, ఆయన అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.
వరంగల్ నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.6,000 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మరింత బలంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు.మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రాజాలి, మామిండ్ల రాజు, తాడిశెట్టి విద్యాసాగర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరూరి సాంబయ్య, మాజీ చైర్మన్ రామకృష్ణ, జిల్లా మీడియా సెల్ ఇన్చార్జి మార్క విజయ్ కుమార్, లీగల్ సెల్ చైర్మన్ తోట రాజకుమార్, నాయకులు పులి రాజు, బోడడిన్న, రహిమున్నీసా తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; వేణు రావు, హనుమకొండ, హనుమకొండ జిల్లా