గూగుల్‌పై మలేషియా ప్రభుత్వం రూ. 1,300 కోట్ల దావా:
సూర్య గ్లోబల్ & టెక్ డెస్క్ (కౌలాలంపూర్): అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ కు మలేషియా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తమ దేశంలో ఆన్‌లైన్ వేదికలపై హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో గూగుల్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, మలేషియా ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ 'మలేషియా కమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా కమిషన్' కౌలాలంపూర్ హైకోర్టులో దావా వేసింది. గూగుల్ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన నష్టానికి పరిహారంగా 600 మిలియన్ మలేషియా రింగిట్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1,300 కోట్లు) చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది.
50,000కు పైగా హానికరమైన కంటెంట్‌లపై చర్యలు శూన్యం:
గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ వేదికగా చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ జూదం , ఆర్థిక మోసాలు మరియు ఇతర హానికరమైన కంటెంట్ విచ్చలవిడిగా ప్రసారమవుతోందని ఎంసీఎంసీ తన పిటిషన్‌లో పేర్కొంది. దాదాపు 50,000కు పైగా అభ్యంతరకరమైన కంటెంట్‌లను తొలగించాలని కోరినప్పటికీ గూగుల్ సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదని మలేషియా ఆరోపించింది. ఈ హానికరమైన కంటెంట్‌ను ఎదుర్కోవడానికి, పర్యవేక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగం వెచ్చించిన వనరులు మరియు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకే 600 మిలియన్ రింగిట్ల పరిహారం కోరుతున్నట్లు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కౌలాలంపూర్ హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంసీఎంసీ తెలిపింది.
15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటన తర్వాతే ఈ పరిణామం:
మలేషియాలో 2027 మరియు 2028 సంవత్సరాల్లో డేటా సెంటర్ క్యాంపస్‌లు, క్లీన్ ఎనర్జీ మరియు ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఏకంగా15 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించిన కొద్ది వారాలకే ఈ భారీ దావా నమోదు కావడం అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు, తమ డేటా సెంటర్లలోకి దిగుమతి అయ్యే కృత్రిమ మేధస్సు చిప్‌లను పర్యవేక్షించేందుకు కూడా మలేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మలేషియా ప్రభుత్వ తాజా దావాపై గూగుల్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.