అమెరికాలో డేటా సెంటర్ల జోరు
సూర్య బిజినెస్ డెస్క్: కృత్రిమ మేధస్సు విస్తరణతో అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణం వేగవంతమవుతుండటంతో 2028 వరకు విద్యుత్, సహజ వాయువు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. మరింత విస్తీర్ణంలో, అధిక విద్యుత్ అవసరమయ్యే అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకోవడం ఇంధన రంగంపై సానుకూల ఒత్తిడిని పెంచుతోందని తాజా నివేదికలో పేర్కొంది. 2028 నాటికి అమెరికాలో డేటా సెంటర్ల ద్వారా అదనంగా 52 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం అందుబాటులోకి రావచ్చని, దీనివల్ల దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై భారం మరింత పెరుగుతుందని వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో డేటా సెంటర్ల విద్యుత్ సామర్థ్యం, డిమాండ్ దాదాపు 30 శాతం మేర పెరిగాయని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. దేశ మొత్తం విద్యుత్ డిమాండ్ వృద్ధిలో మూడో వంతుకు పైగా వాటా ఈ డేటా సెంటర్లదేనని స్పష్టం చేసింది. డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ వల్ల అమెరికా విద్యుత్ మార్కెట్లలో మరింత బిగుతు వాతావరణం ఏర్పడటంతో పాటు సహజ వాయువు వినియోగం కూడా పెరుగుతుందని విశ్లేషించింది. ఫలితంగా 2028 నుంచి 2030 మధ్య కాలంలో హెన్రీ హబ్ సహజ వాయువు ధరలపై సానుకూల అంచనాలకు ఇది బలం చేకూరుస్తుందని పేర్కొంది.
మరోవైపు 2028లో అంచనా వేసిన కొత్త విద్యుత్ సామర్థ్యంలో సుమారు 26 గిగావాట్ల ప్రాజెక్టులకు ఇంకా భూమిపూజ, నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉందని నివేదిక గుర్తుచేసింది. పీజేఎం, టెక్సాస్ ఈఆర్‌సీఓటీ, మిడ్‌వెస్ట్ ఎంఐఎస్ఓ వంటి ప్రధాన విద్యుత్ మార్కెట్లలో ఈ విస్తరణ ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని వివరించింది. ప్రాజెక్టులకు సకాలంలో అనుమతులు లభించడం, నిర్మాణాలు వేగంగా పూర్తికావడం, ఏఐ సర్వర్ల వినియోగం ఆశించిన స్థాయిలో ఉండటంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపింది.
అయితే అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం టెక్సాస్, ఒహియో, జార్జియా వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకునే విధానపరమైన మార్పులు కొన్ని భారీ డేటా సెంటర్ ప్రాజెక్టుల వేగాన్ని కొంతమేర నెమ్మదింపజేసే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. చారిత్రకంగా చూస్తే ప్రాజెక్టుల జాప్యం, రద్దు వంటి కారణాలతో ప్రకటించిన సామర్థ్యంలో కొంత భాగం మాత్రమే నిర్ణీత సమయంలో అందుబాటులోకి వస్తుందని, అయినప్పటికీ ఏఐ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ఊపు ఇంధన రంగానికి దీర్ఘకాలికంగా కీలక చోదకంగా నిలుస్తుందని నివేదిక స్పష్టం చేసింది.