బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కార్మికుల కనీస వేతనం 36 శాతం పెంపు
సూర్య బిజినెస్ డెస్క్: వస్త్ర పరిశ్రమ కార్మికుల కనీస వేతనాన్ని 36 శాతం పెంచుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం నియమించిన వేతన బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాల పెంపు కోరుతూ కార్మికులు వారాల తరబడి నిర్వహించిన ఆందోళనలు, నిరసనల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. దాదాపు 12 గంటల పాటు కార్మిక, యజమాని ప్రతినిధుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కొత్త వేతన నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఉన్న 12,500 టాకాల కనీస వేతనాన్ని 17,000 టాకాలకు పెంచుతూ నాలుగు గ్రేడ్ల వేతన విధానాన్ని ఖరారు చేశారు. కొత్త విధానం ప్రకారం గ్రేడ్-4 కార్మికులకు నెలకు 17,000 టాకాలు, గ్రేడ్-1 కార్మికులకు 21,500 టాకాల వరకు వేతనాలు లభించనున్నాయి. ఆరు సభ్యుల వేతన బోర్డులో నలుగురు సభ్యులు 17,000 టాకాల ప్రతిపాదనకు మద్దతు తెలపగా, ఇద్దరు సభ్యులు కార్మికుల డిమాండ్ అయిన 18,000 టాకాల వైపు నిలిచారు.
నిత్యావసర సరుకులు, అద్దెలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో జీవనోపాధి కష్టంగా మారిందని కార్మికులు వేతనాల పెంపు కోసం డిమాండ్ చేశారు. ఈ నిరసనల కారణంగా పలు కర్మాగారాలు మూతపడటం, రవాణా మార్గాలు స్తంభించడంతో ఉత్పత్తి కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దుస్తుల ఎగుమతి దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఎగుమతి ఆదాయంలో వస్త్ర రంగం వాటా 80 శాతానికి పైగా ఉంది.
ఈ రంగంలో 40 లక్షలకు పైగా కార్మికులు పనిచేస్తుండగా, అంతర్జాతీయ ప్రముఖ ఫ్యాషన్ సంస్థలకు ఇక్కడి నుంచే భారీగా సరఫరాలు జరుగుతాయి. వ్యయ భారం, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగమనం వంటి సవాళ్ల మధ్య వేతనాలను పెంచాల్సి రావడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త వేతన నిర్ణయంతో ఉద్రిక్తతలు తగ్గి, పరిశ్రమలో కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.