మలేసియా ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ కీలక నిర్ణయం
సూర్య బిజినెస్ డెస్క్: విమానాల ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా 10 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ మలేసియా ఏవియేషన్ గ్రూప్ ప్రకటించింది. కౌలాలంపూర్‌లో బుధవారం నిర్వహించిన పత్రాల మార్పిడి కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు, సీఈఓ కెప్టెన్ నసరుద్దీన్ ఎ బకర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంలో అదనంగా మరో ఆరు విమానాలను కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉందని ఆయన తెలిపారు.
దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన సామర్థ్యం, సౌలభ్యం, ఇంధన సామర్థ్యాన్ని డ్రీమ్‌లైనర్ విమానాలు అందిస్తాయని నసరుద్దీన్ పేర్కొన్నారు. విస్తృత పరిశీలన అనంతరం ఈ విమానాలను ఎంపిక చేశామని, కీలక అంతర్జాతీయ మార్కెట్లలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఇవి దోహదపడతాయని ఆయన వివరించారు. మలేసియాలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నడిపే తొలి విమానయాన సంస్థగా మలేసియా ఎయిర్‌లైన్స్ నిలవనుంది.
ఈ కొత్త విమానాలు 2032 నుంచి 2035 మధ్య కాలంలో దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మలేసియా ఏవియేషన్ గ్రూప్ వద్ద ఉన్న ఏడు ఎయిర్‌బస్ ఎ350 విమానాలను ఇదే కాలంలో దశలవారీగా ఉపసంహరించుకుని, వాటి స్థానంలో ఈ డ్రీమ్‌లైనర్ విమానాలను వినియోగించనున్నారు. లండన్, పారిస్, సిడ్నీ, మెల్‌బోర్న్, టోక్యో, ఒసాకా, సియోల్ వంటి ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో ఈ విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కౌలాలంపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం హాజరయ్యారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. గతంలో అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలుకు మలేసియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజా డ్రీమ్‌లైనర్ కొనుగోలుతో ఆసియా విమానయాన రంగంలో బోయింగ్ సంస్థకు మరో కీలక ఆర్డర్ లభించినట్లయింది.