national
గోశాలను తొలగించేందుకు కుట్రలు శివ్ గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న శివ్ గోశాలను తొలగించేందుకు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియా ముసుగులో డబ్బులు డిమాండ్ చేస్తూ గోశాల నిర్వాహకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి ఆరోపించారు. గోసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జయరాం సిర్వి మాట్లాడుతూ, మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ మండలం యాప్రాల్‌లోని బాలాజీనగర్ వికలాంగుల కాలనీలో 2012లో 960 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, గోప్రేమికుల సహకారంతో శివ్ గోశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి అవసరమైన అనుమతులతో గోసేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గోశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ, నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై కూడా తప్పుడు ప్రచారం చేస్తూ, గోశాలను తొలగించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థపై ఈ విధంగా బెదిరింపులకు పాల్పడటం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు.సోషల్ మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించే చర్యలను తక్షణమే మానుకోవాలని జయరాం సిర్వి హెచ్చరించారు. గోశాల నిర్వహణకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమను బెదిరిస్తూ, వేధింపులకు గురిచేస్తున్న వారిపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గోశాల ఉపాధ్యక్షుడు మంగీలాల్, కోశాధికారి లక్ష్మణ్ రామ్, కార్యదర్శి వర్దరామ్, సభ్యులు హీర్ సింగ్, అర్జున్ లాల్ తదితరులు పాల్గొన్నారు