సృజనాత్మక స్వేచ్ఛ, విభిన్న కథాంశాలపై చర్చ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రపంచ సినిమా రంగంలో మహిళా దర్శకులకు మరింత సృజనాత్మక స్వేచ్ఛ లభించాలని, విభిన్న సామాజిక మరియు సాంస్కృతిక కథాంశాలకు ప్రాధాన్యం పెరగాలని కిర్గిజ్స్తాన్, రొమేనియా, మెక్సికో దేశాలకు చెందిన మహిళా సినీ రూపకర్తలు పిలుపునిచ్చారు. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం వేదికగా నిర్వహించిన ప్రత్యేక ప్యానెల్ చర్చలో వారు తమ సినీ ప్రయాణాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మనసు విప్పారు. హెర్ లెన్స్, హెర్ లెగసీ, హెర్ లిబర్టీ పేరుతో సాగిన ఈ చర్చలో కిర్గిజ్ రచయిత మరియు దర్శకురాలు నర్గిజా డొటీవా, రొమేనియన్ రోమా నటి, దర్శకురాలు అలీనా సెర్బన్, మెక్సికన్ అమెరికన్ దర్శకురాలు సుజాన్ ఆండ్రూస్ కొరియా పాల్గొనగా, భారతీయ దర్శకుడు అభిషేక్ జైన్ మోడరేటర్‌గా వ్యవహరించారు.
సాంస్కృతిక మూలాలు తమ సినీ స్వరాన్ని ఎలా తీర్చిదిద్దాయో వక్తలు వివరించారు. చిన్న సరస్సు తీర పట్టణంలో పెరిగిన తాను తాతయ్య చెప్పే సంప్రదాయ కిర్గిజ్ మౌఖిక కవిత్వం ద్వారా కథ చెప్పడంపై ఆసక్తి పెంచుకున్నానని నర్గిజా డొటీవా తెలిపారు. తొలుత ప్రకటనల రంగంలో పనిచేసి, ఆ తర్వాత సొంత నిధులతో సినిమాలు నిర్మించానని, తన తొలి ఫీచర్ చిత్రం స్కైలార్క్ సరిహద్దు ప్రాంత చరిత్ర మరియు సార్వత్రిక మానవ భావోద్వేగాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు. బుకారెస్ట్‌లోని రోమా కుటుంబంలో జన్మించిన అలీనా సెర్బన్, ఇఫీలో పాల్గొనడాన్ని తన పూర్వీకుల మూలాలతో భావోద్వేగ అనుబంధంగా పేర్కొన్నారు. రోమా భాషలో ఇప్పటికీ ఉన్న భారతీయ మూలాల పదాలను, రాజస్థాన్‌తో ఉన్న చారిత్రక సంబంధాలను గుర్తు చేసుకుంటూ, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా థియేటర్ మరియు సినిమా ద్వారా తన స్వరం వినిపిస్తున్నానని చెప్పారు.
సియుడాడ్ జువారెజ్ నేపథ్యంగా తన తొలి ఫీచర్ చిత్రం లా కాజడోరా రూపకల్పనకు దశాబ్ద కాలం పట్టిందని సుజాన్ ఆండ్రూస్ కొరియా వెల్లడించారు. మహిళలపై హింస వంటి వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆవేదన నుంచి ఆత్మగౌరవం, పోరాట పటిమ వైపు ప్రయాణించిందని వివరించారు. స్వతంత్ర సినిమా రంగంలో మహిళలు మరియు అణగారిన వర్గాల దర్శకులు ఎదుర్కొంటున్న నిధుల కొరత, లింగ వివక్ష మరియు మూస ధోరణులపై కూడా చర్చ జరిగింది. వాణిజ్యపరంగా సురక్షితమైన కథలకే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారని, క్లిష్టమైన ఇతివృత్తాలకు మద్దతు లభించడం కష్టంగా మారుతోందని కొరియా అభిప్రాయపడ్డారు. మూస పద్ధతుల్లో లేని కథలకు నిధులు తిరస్కరించబడ్డ సందర్భాలను సెర్బన్ ప్రస్తావిస్తూ, కేవలం ఒక వర్గ ప్రాతినిధ్యంగా కాకుండా కళాత్మక ప్రతిభ ఆధారంగా దర్శకులను గుర్తించాలని కోరారు.
స్థానిక వాస్తవాల నుంచి పుట్టిన కథలు నిజాయితీతో కూడుకుని ఉంటే భాష, దేశాల సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కదిలిస్తాయని ప్యానెలిస్టులు విశ్వాసం వ్యక్తం చేశారు. విభిన్న ప్రాంతాలు మరియు సంస్కృతులకు చెందిన కథలకు ప్రేక్షకులు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు అండగా నిలవాలని నర్గిజా డొటీవా నొక్కి చెప్పారు. విభిన్న గొంతులకు వేదిక కల్పిస్తూ, సరిహద్దులను దాటే కథలను ఆదరించే ఇఫీ స్ఫూర్తికి ఈ చర్చ నిలువెత్తు అద్దం పట్టింది.