'అశ్విన్స్' దర్శకుడితో శ్రుతి హాసన్ కొత్త తమిళ చిత్రం.. ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విభిన్న కథాంశాలు, నాణ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శాంతి టాకీస్ నిర్మాణ సంస్థ తాజాగా మరో కొత్త తమిళ సినిమాను అధికారికంగా ప్రకటించింది. అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అశ్విన్స్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తరుణ్ తేజ ఈ ప్రాజెక్టుకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మావీరన్, 3బీహెచ్‌కే వంటి విభిన్న చిత్రాల తర్వాత శాంతి టాకీస్ నుంచి వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తన నటనతో పాటు గాయనిగా, సంగీత కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రుతి హాసన్, ప్రతి ప్రాజెక్టులోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల ఆకాశంలో ఒక తార చిత్రంలో రోహిణి అనే లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ పాత్రలో చక్కని భావోద్వేగాలు పండించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు తరుణ్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త తమిళ చిత్రంలో శ్రుతి హాసన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
గతంలో వసంత్ రవి హీరోగా తెరకెక్కిన అశ్విన్స్ చిత్రానికి తరుణ్ తేజ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ సినిమా కథనం, విజువల్స్, సౌండ్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా, తరుణ్ తేజ దర్శకత్వ శైలికి శ్రుతి హాసన్ నటన తోడవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ చిత్రం ద్వారా మరో కొత్త జానర్‌ను పరిచయం చేసేందుకు శాంతి టాకీస్ బృందం సన్నాహాలు చేస్తోంది. తారాగణం, సాంకేతిక నిపుణులు, కథాంశం, షూటింగ్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Also Read: నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్'.. ఆకట్టుకుంటోన్న 'అప్సర' లిరికల్ సాంగ్