నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్'.. ఆకట్టుకుంటోన్న 'అప్సర' లిరికల్ సాంగ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కమిటీ కుర్రోళ్లు చిత్రంతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు అదే తరహా ఉత్సాహంతో పాకెట్ రాకెట్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్సర అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా ప్రారంభించిన మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా విడుదలైన అప్సర పాట ఆకట్టుకుంటోంది. గ్యానీ అందించిన బాణీ, గాత్రం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచాయి. రమేష్ కుమార్ రాసిన సాహిత్యంతో పాటు జేడీ మాస్టర్ సమకూర్చిన స్టెప్పులు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని చక్కగా ఆవిష్కరించేలా రూపొందించిన లిరికల్ వీడియో యువతను అలరిస్తోంది.
ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా, శ్రియా కొంతం కథానాయికగా కనిపించనున్నారు. వీరితో పాటు జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విభిన్న కథాంశం, యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న పాకెట్ రాకెట్స్ చిత్రాన్ని డిసెంబర్ 11న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విడుదలైన అప్సర పాటకు లభిస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.