కూతురి కోసం తండ్రి పోరాటం.. ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ 'నాన్న కుట్టి' ట్రైలర్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాన్న కుట్టి ట్రైలర్ తాజాగా విడుదలైంది. ము. మారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన కూతురు దియాను అన్ని తానే అయి పెంచే తండ్రిగా విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో కనిపించారు. తన గారాల పట్టికి ఒక క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు, ఆ చిన్నారిని కాపాడుకునేందుకు ఒక తండ్రి ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. భావోద్వేగ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఘట్టాలు, కోర్టు, పోలీస్ స్టేషన్ డ్రామాతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
ట్రైలర్‌లో కనిపించే భావోద్వేగాలు విజయ్ ఆంటోనీ వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసేలా ఉండటం సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. నిజ జీవితంలోనూ విజయ్ ఆంటోనీ తన పెద్ద కూతురిని కోల్పోయిన విషాద ఘటన తెలిసిందే. ఆ నేపథ్యంలో కూతురి చుట్టూ తిరిగే ఈ కథలో ఆయన నటన మరింత హృద్యంగా, సహజంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న నాన్న కుట్టి చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఎమోషన్, సస్పెన్స్, యాక్షన్ కలబోతగా వస్తున్న ఈ సినిమా విజయ్ ఆంటోనీ ఖాతాలో మరో విజయాన్ని నిలుపుతుందో లేదో చూడాలి.