ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారత సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఫూలే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కులవివక్ష, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళా విద్య, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ ఆదర్శ దంపతుల ప్రయాణాన్ని ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి ఫూలే పాత్రలో పత్రలేఖ నటించారు.
నవంబర్ 28, 2026న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలు, ఫూలే దంపతులు ఎదుర్కొన్న అవమానాలు, చేసిన త్యాగాలను నేటి తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే నవంబర్ 27న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ విడుదల చేస్తుండగా, తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి మాటలు అందించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసలు కురిపించారు.
సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, సుమారు రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి యువత, విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు తప్పక తెలుసుకోవాలని పేర్కొన్నారు. నవంబర్ 26న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి హీరో ప్రతీక్ గాంధీ హాజరవుతారని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ ఫూలే దంపతుల పోరాటం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మహిళా విద్యకు, సమానత్వానికి పునాదులు వేసిన సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావ్ ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ సందేశాత్మక చిత్రం పెద్ద విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు..
Also Read: శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం