ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి.
అనకాపల్లి, నవంబర్ 24, మేజర్ న్యూస్: ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని గ్రామీణ నీటిపారుదల శాఖ, శానిటేషన్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ టి. గాయత్రీ దేవి అన్నారు. 2019వ సంవత్సరంలో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్, 2024వ సంవత్సరంలో తిరిగి పునఃప్రారంభమై జల్ జీవన్ మిషన్ 2.0 గా కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ప్రాసెసింగ్‌లో ఎన్ని ఉన్నాయి, ఆలస్యానికి గల కారణాలపై మంగళవారం మండలంలోని సంపతిపురం మెగా రక్షిత తాగునీటి పథకం వద్ద ఉమ్మడి విశాఖ జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల నీటిపారుదల శాఖ సిబ్బందితో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చీఫ్ ఇంజినీర్ టి.గాయత్రీ దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటికి ఏడు సంవత్సరాలుగా జల్ జీవన్ మిషన్ పథకంలో ప్రయాణిస్తున్నామని, డిపార్ట్‌మెంట్‌లోని జేఈ, డీఈ స్థాయి అధికారులకు జేజేఎంపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. డిపార్ట్‌మెంట్‌కు జేఈ, డీఈలు గుండెకాయ లాంటివారని, ఫీల్డ్‌కు వెళ్లి పనుల నాణ్యత, వేగాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని సూచించారు. పనులు పూర్తయిన చోట బిల్లులు అప్‌లోడ్ చేసి క్లియరెన్స్ ఇవ్వాలన్నారు. 2027 మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ పనులు పూర్తి చేయాలని, గడువు దాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ రద్దవుతుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయి ఏర్పాటైన తర్వాత ఆయా పంచాయతీలకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రామస్వామి, ఈఈ అనిల్ కుమార్, డీఈలు విజయలక్ష్మి, ప్రసాదు, ఆనంద్, వెల్కన్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, పై నాలుగు జిల్లాల డీఈలు, జేఈలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: నాగు యన్నంశెట్టి, అనకాపల్లి.