వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ...!
ఆశావహుల మధ్య తీవ్ర పోటీతో అధిష్ఠానానికి తలనొప్పి..…
ఎల్.ఈ. పుష్పావతి, బొమ్మన రమాకాంత్ రెడ్డి వర్గాల మధ్య పోటాపోటీ ..…
ప్రత్యామ్నాయంగా స్వతంత్ర అభ్యర్థి వైపు అధిష్ఠానం చూపు..…
వైకాపాకు కలిసొస్తాయంటున్న స్థానికులు ..…
వెల్దుర్తి, వెల్దుర్తి రూరల్ మేజర్ న్యూస్ : వెల్దుర్తి సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుల మధ్యే తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఖరారు అధిష్ఠానానికి కత్తిమీద సాములా తయారైంది.
పోటాపోటీగా ఆశావహులు:
తెదేపా తరఫున సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఎల్.ఈ.పుష్పావతి, బొమ్మన రమాకాంత్ రెడ్డి వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పార్టీకి తాము చేసిన సేవలను గుర్తుచేస్తూ టికెట్ తమకే దక్కాలని ఇరువురు నేతలు పట్టుబడుతున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో, విభేదాలకు తావులేకుండా ఒక స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిని బరిలోకి దించేందుకు అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగితే ఆర్థిక బలంతో పాటు వారి మాటతీరు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తుందని, ఆయనకు ముందుంది ముసళ్ల పండగేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పార్టీ శ్రేణుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.…
యువతకు ప్రాధాన్యం ఈసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని యువ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు,బీసీ నినాదం సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ వర్గాలకు సర్పంచ్ పీఠం కేటాయించాలని సీనియర్ తెదేపా నాయకులు అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
వైకాపాకు కలిసొస్తాయంటున్న ప్రజలు..…
ఒకవైపు ప్రధాన ఆశావహుల మధ్య పోటీ, మరోవైపు బీసీలు, యువత డిమాండ్ల మధ్య ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తెదేపా అధిష్ఠానం తలపట్టుకుంటోంది. పార్టీలో నెలకొన్న ఈ విభేదాలు, అనైక్యత ఇలాగే కొనసాగితే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సర్పంచ్ పీఠం సులభంగా వైకాపా ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వెల్దుర్తి పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.