'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ అప్‌డేట్.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాని
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నేచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అలియాస్ రుక్మిణి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు పాటలు విడుదలై యువతను ఆకట్టుకోగా, ట్రైలర్ విడుదలకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సరదా వీడియోను పంచుకున్నారు. ఇందులో నాని తనపై తానే వేసుకున్న సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.
ఆ ప్రమోషనల్ వీడియోలో దర్శకుడు మురళీకాంత్ నాని వద్దకు వచ్చి, అలియాస్ రుక్మిణి సినిమాకు ఎలాంటి ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేద్దామా అని అడుగుతారు. దానికి నాని స్పందిస్తూ, తన అనుభవంతో చెబుతున్నానని, దయచేసి ఆ పని మాత్రం చేయవద్దని, ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేయకూడదని గట్టిగా చెబుతూనే ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రాన్ని ట్రైలర్ లేకుండా విడుదల చేయడం, ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్‌పై పడటాన్ని గుర్తుచేసుకుంటూ నాని తనపై తానే సెటైర్ వేసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
నాని ఇచ్చిన ఈ సరదా సలహాతో చిత్ర బృందం ఎట్టకేలకు ట్రైలర్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న అలియాస్ రుక్మిణి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోషన్లలో భాగంగా నాని చేసిన ఈ సెల్ఫ్-ట్రోల్ గేమ్ సినిమాకు మంచి బజ్‌ను తీసుకురావడంలో తోడ్పడింది.
యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న అలియాస్ రుక్మిణి చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.