మిట్స్‌లో ఘనంగా ఐఈఈఈ అనంతపురం జోనల్ కాంగ్రెస్-2026 : మహిళా సాధికారత,నాయకత్వ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఐఈఈఈ ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ (డబ్ల్యూఐఈ) ఆధ్వర్యంలో మంగళవారం ఐఈఈఈ ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ అనంతపురం జోనల్ కాంగ్రెస్-2026 ఒక్కరోజు సాంకేతిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జపానులోని క్యోటో యూనివర్సిటీకు చెందిన ఐఈఈఈ ఫెలో,ప్రొఫెసర్ ఈజీ ఒక్కి,ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్‌కు చెందిన ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ అఫినిటీ గ్రూప్ చైర్ డాక్టర్ పి.ఏ.హర్ష వర్ధినిలు పాల్గొన్నారు.ముందుగా ముఖ్య అతిథులు,వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఈజీ ఒక్కి మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సాంకేతిక రంగాలను గుర్తించి,పరిశోధనా వ్యాసాలు,అంతర్జాతీయ సదస్సులు,వర్క్‌షాప్‌ల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.విద్యార్థులు పరిశోధనా వ్యాసాలను చదవడం నుంచి ప్రారంభించి,భవిష్యత్తులో పరిశోధనా వ్యాసాలను ప్రచురించే రచయితలుగా,సదస్సుల్లో ప్రసంగించే వక్తలుగా ఎదగాలన్నారు.అంతర్జాతీయ సదస్సులు,వర్క్‌షాప్‌ల ద్వారా ప్రముఖ పరిశోధకులు,నిపుణులతో పరిచయాలు పెంపొందించుకుని,వారి అనుభవాలు,ఆలోచనలను పంచుకోవాలని తెలిపారు.ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని,భవిష్యత్తులో ఉన్నతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని విద్యార్థులకు తెలిపారు.అనంతరం పి.ఏ.హర్షవర్ధిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు నాయకత్వ లక్షణాలు,ఆత్మవిశ్వాసం,కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలన్నారు.జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నాలుగు ముఖ్యమైన సూత్రాలను పాటించాలన్నారు.మొదటిగా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం,వారి అనుభవాల నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం,నాయకత్వ బాధ్యతలను స్వీకరించడం,చివరగా ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఐఈఈఈ వంటి అంతర్జాతీయ వృత్తిపరమైన సంస్థల్లో సభ్యత్వం పొందడం ద్వారా పరిశోధనా పత్రాల రచన,ప్రాజెక్టులు,హ్యాకథాన్‌లు,స్కాలర్‌షిప్‌లు,మెంటార్‌షిప్ కార్యక్రమాలు,సాంకేతిక శిక్షణ వంటి అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.విద్యార్థులు చివరి సంవత్సరం వరకు వేచి ఉండకుండా మొదటి సంవత్సరం నుంచే తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ,వివిధ సాంకేతిక,వృత్తిపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.మహిళా సాధికారతపై మాట్లాడుతూ మహిళలు వ్యక్తిగత,కుటుంబ,ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తమ లక్ష్యాల సాధనలో వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.మహిళల్లో అపారమైన ప్రతిభ,సామర్థ్యం ఉన్నాయని,వారికి తగిన ప్రోత్సాహం,సహకారం లభిస్తే ప్రతి రంగంలోనూ విజయాలు సాధించగలరని తెలిపారు.మహిళల అభివృద్ధికి పురుషులు కూడా సమానంగా సహకరించాలని,స్త్రీ,పురుషులు పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ జోనల్ కాంగ్రెస్ నిర్వహణ ప్రధాన ఉద్దేశం వివిధ ప్రాంతాలకు చెందిన కళాశాలల విద్యార్థులకు వృత్తిపరమైన పరిచయాలు,సాంకేతిక విజ్ఞానం,నైపుణ్యాభివృద్ధి అవకాశాలను చేరువ చేయడమేనని తెలిపారు.విద్యార్థులు తమలోని భయాన్ని,సంకోచాన్ని విడిచిపెట్టి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని,అధ్యాపకులు,పరిశ్రమల నిపుణులు మరియు అనుభవజ్ఞులతో మమేకమై వారి అనుభవాల నుంచి నేర్చుకోవాలని సూచించారు.విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి,నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ,నాయకత్వ బాధ్యతలను స్వీకరించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని తెలిపారు.పరిచయాలు పెంచుకోవడం - నేర్చుకోవడం - నాయకత్వం వహించండి - ఇతరులకు స్ఫూర్తినివ్వండనే నాలుగు సూత్రాలను జీవితంలో భాగం చేసుకుని తమకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని తెలిపారు.ఇందులో భాగంగా నిర్వహించిన పోటీలలో పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికెట్స్,బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.పద్మ,ఐఈఈఈ డబ్ల్యూఐఈ అఫినిటీ గ్రూప్ మెంబెర్ డాక్టర్ జి.నాగశ్వేత,ఐఈఈఈ కోఆర్డినేటర్ డాక్టర్ సోము,విజయ భాస్కర్,వివిధ కళాశాలల నుండి 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి