నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లాలో నవంబర్ 26న జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రుద్రవరం మండలంలోని 20 గ్రామపంచాయతీలు, సిరివెళ్ల మండలంలోని 13 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆయా మండలాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సంబంధిత అధికారులతో మాట్లాడి భద్రతా చర్యలు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా లోబడి, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు సంబంధం అధికారులు పాల్గొన్నారు. *మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*