2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత్ బయో ఎకానమీ
సూర్య బిజినెస్ డెస్క్: బయోటెక్నాలజీ స్టార్టప్‌ల వేగవంతమైన విస్తరణ, పెరుగుతున్న పరిశోధన సామర్థ్యాలు, పరిశ్రమల భాగస్వామ్యం తోడ్పాటుతో 2030 నాటికి భారత బయో ఎకానమీ విలువ 300 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ గ్లోబల్ జెనోమిక్స్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగించారు. తదుపరి పారిశ్రామిక విప్లవాన్ని నడిపించే కీలక చోదక శక్తిగా బయోటెక్నాలజీ నిలుస్తోందని పేర్కొంటూ, జెనోమిక్స్, మల్టీ-ఓమిక్స్, అధునాతన బయోటెక్నాలజీ రంగాల్లోని నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమ దిగ్గజాలు, స్టార్టప్‌లు, మదుపరులకు పిలుపునిచ్చారు.
బయోటెక్నాలజీ రంగంలో దేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ, 2014లో సుమారు 50 నుంచి 60 వరకు ఉన్న బయోటెక్ స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం దాదాపు 11,000కు చేరుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇదే కాల వ్యవధిలో భారత బయో ఎకానమీ సుమారు 10 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 195 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు. పరిశోధన, ఆవిష్కరణల రంగాలకు లభిస్తున్న ప్రోత్సాహంతో ఈ రంగం వేగంగా పురోగమిస్తోందని తెలిపారు.
సైన్స్, పరిశ్రమలు, మదుపుదారుల మధ్య సమన్వయం మరింత బలపడితే రాబోయే సంవత్సరాల్లో భారతదేశం గ్లోబల్ బయోటెక్నాలజీ కేంద్రంగా మరింత పటిష్ఠమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 2030 లక్ష్యాన్ని చేరుకోవడంలో కొత్త ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతల వినియోగం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.