ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు
సూర్య బిజినెస్ డెస్క్: బలమైన ఆర్థిక వృద్ధి, అనుకూల విధానాల మద్దతుతో భారత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రుణ డిమాండ్ నిలకడగా కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మితమైన పెరుగుదల, బలహీనమైన ప్రపంచ వృద్ధి నేపథ్యంలోనూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత జీడీపీ వృద్ధి అత్యుత్తమ స్థాయిలలోనే ఉంటుందని అంచనా వేసింది. గత సెప్టెంబర్‌లోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిని 6.9 శాతంగా ఫిచ్ అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేసింది. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఫైనాన్స్ కంపెనీస్ ఔట్‌లుక్ 2027 నివేదికలో ఈ అంశాలను పేర్కొంది.
అనుకూల ఆర్థిక వాతావరణం, స్థిరమైన రుణ వృద్ధి, తనఖా మరియు బంగారం ఆధారిత రుణాల వంటి తక్కువ రిస్క్ ఉన్న సురక్షిత ఉత్పత్తుల వైపు మళ్లడం వంటి కారణాలతో ఎన్‌బీఎఫ్‌సీల నిరర్థక ఆస్తుల నిష్పత్తి సాధారణంగా స్థిరంగానే ఉంటుందని ఫిచ్ తెలిపింది. బలమైన వృద్ధి వల్ల వచ్చే రిస్క్‌లను సమర్థంగా ఎదుర్కొనేందుకు రుణ అర్హత పరిశీలన, నియంత్రణలను కఠినతరం చేస్తున్నట్లు వివరించింది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ సవాళ్లు, ఈ ఏడాది బలహీనమైన రుతుపవన వర్షాల కారణంగా స్వల్పకాలంలో చిన్న వ్యాపారాలు, గ్రామీణ రంగానికి సంబంధించిన రుణాలలో కొంత మందగమనం కనిపించే అవకాశం ఉందని అంచనా వేసింది.
వచ్చే ఏడాది వడ్డీ రేట్లు పెరిగినా, ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నా రుణగ్రహీతల తిరిగి చెల్లించే సామర్థ్యంపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని ఫిచ్ పేర్కొంది. తక్కువ మొత్తం రుణాలు, స్థిర వడ్డీ రేట్లు, పూచీకత్తు ఆధారిత ఉత్పత్తుల ఆధిపత్యమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
పెరిగిన నిధుల వ్యయాన్ని తట్టుకుంటూనే, బలమైన ఆర్థిక వ్యవస్థ అండతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు స్థిరమైన కార్యకలాపాలతో ముందుకు సాగుతాయని ఈ నివేదిక విశ్లేషించింది. దేశీయ డిమాండ్, విధానపరమైన తోడ్పాటు రాబోయే కాలంలోనూ రుణ రంగానికి కీలక బలంగా నిలుస్తాయని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది.