వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, వచ్చే ఏడాది నుంచి మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణ కార్యకలాపాలకు అంతర్జాతీయ నిధులలో కోత, మానవ హక్కులపై దాడులు, నిరోధక కార్యక్రమాల మందగమనం కారణంగా ఇప్పటివరకు సాధించిన పురోగతి తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయని యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయానిమా పేర్కొన్నారు. ఎయిడ్స్‌ను అంతం చేసే లక్ష్యానికి చేరువవుతున్న వేళ ఇలాంటి పరిణామాలు అత్యంత ఆందోళనకరంగా మారాయని ఆమె అన్నారు. 2027 నాటికి విడుదలయ్యే గణాంకాలలో కొత్త ఇన్ఫెక్షన్ల పెరుగుదల స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు.
తాజాగా విడుదలైన యూఎన్ ఎయిడ్స్ గణాంకాల ప్రకారం, గడిచిన ఏడాది కొత్తగా హెచ్ఐవీ బారిన పడిన వారి సంఖ్య 1.2 మిలియన్లుగా నమోదైంది. 1994లో గరిష్ఠంగా 3.5 మిలియన్ల మంది కొత్తగా సంక్రమణకు గురికాగా, ఆ స్థాయి నుంచి ఇది చారిత్రాత్మక కనిష్టానికి తగ్గింది. అంతర్జాతీయ నిధులలో సుమారు ఇరవై శాతం మేర తగ్గుదల నమోదైనప్పటికీ ఈ తగ్గుదల కనిపించింది. అయితే నిధుల కొరతను భర్తీ చేసుకునే స్థోమత లేక అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, దీనివల్ల నిరోధక క్లినిక్‌లు మూతపడటం, సిబ్బంది సంఖ్య తగ్గడం వంటి ప్రభావాలు త్వరలోనే ఇన్ఫెక్షన్ల గణాంకాలపై పడే ప్రమాదం ఉందని విన్నీ బయానిమా హెచ్చరించారు. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని ఆమె తెలిపారు.
నిధుల కోత వల్ల హెచ్ఐవీ నిరోధక కార్యక్రమాలు, కమ్యూనిటీ ఆధారిత సేవలు, ప్రయోగశాల వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. హెచ్ఐవీ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందులను ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పరీక్షలు తగ్గడం, చికిత్స ప్రారంభించే వారి సంఖ్య పడిపోవడం, మందుల వినియోగంలో నిరంతరాయ మద్దతు లోపించడం వంటి అంశాలు భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి పెరగడానికి దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల లోటు వెంటనే ప్రభావం చూపకపోయినా, కాలక్రమేణా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య రంగానికి నిధుల సమీకరణలో దేశీయ, అంతర్జాతీయ భాగస్వామ్యం కీలకమని, మానవ హక్కుల పరిరక్షణ, వివక్ష లేని వైద్య సేవలతోనే ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని విన్నీ బయానిమా నొక్కి చెప్పారు. ప్రభుత్వాలు, స్థానిక సమాజాలు వెంటనే మేల్కొని నిరోధక సేవలను బలోపేతం చేస్తేనే సంభవించే ముప్పును నివారించగలమని ఆమె స్పష్టం చేశారు. లేనిపక్షంలో దశాబ్దాల పాటు చేసిన కృషి వృథా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.