చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం
నగరం, మేజర్ న్యూస్:
గ్రామానికి అభివృద్ధి కావాలి .. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం కావాలి .. సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే బాధ్యతాయుతమైన పాలన రావాలి .. ఇదే నినాదంతో ఉల్లిపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థిగా ఈమని అవినాష్ తనదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఉన్నత విద్యావంతుడిగా, గ్రామ సమస్యలపై అవగాహన కలిగిన అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంఎస్సీ, ఎంఈడీ ఉన్నత విద్యను అభ్యసించిన అవినాష్ .. విద్యతో వచ్చిన విజ్ఞానాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తానని స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే ఉల్లిపాలెం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి సమస్యపై అవగాహన .. అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక!
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పెద్దపీట వేస్తానని చెప్తున్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారంతో పాటు విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇస్తున్నారు. మార్పు మాటల్లో కాదు .. చేతల్లో చూపిస్తా! గ్రామ పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తానని అవినాష్ పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ పక్షపాతాలకు తావులేని పాలన అందించడమే తన సంకల్పమని, ఒక విద్యావంతుడిగా గ్రామ భవిష్యత్తుపై తనకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో అవినాష్ చేస్తున్న విస్తృత పర్యటన గ్రామ రాజకీయ వాతావరణంలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఉన్నత విద్యార్హతలు, అభివృద్ధి పట్ల నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉల్లిపాలెం అభివృద్ధి దిశానిర్దేశం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి మాటలు సరిపోవు .. నిరంతర కృషి, చిత్తశుద్ధి అవసరమని ఈమని అవినాష్ తన ప్రచారంలో ప్రధానంగా ప్రజల ముందుంచుతున్నారు.