ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు
రేపల్లె, మేజర్ న్యూస్;
రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన ఎరువుల బుకింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేపల్లె మండల వ్యవసాయ అధికారి అవ్వారు మహేష్ బాబు సూచించారు. బుధవారం మండలంలోని అరవపల్లి, నల్లూరు గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా రైతులకు నూతన ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడారు.ఈ సందర్భంగా ఏఓ మహేష్ బాబు మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే తమకు అవసరమైన ఎరువులను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రైతులు తమ సెల్‌ఫోన్లలోని ప్లే స్టోర్ ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆధార్ కార్డు లేదా ఏపీ ఫార్మర్ ఐడీ వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం క్యూఆర్ కోడ్ విధానం ద్వారా అవసరమైన ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకుని సంబంధిత ఎరువుల డీలర్ల వద్ద పొందవచ్చని వివరించారు.ఈ విధానం భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఉపయోగపడుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే ఎరువులను బుక్ చేసుకోవాలని కోరారు. అలాగే ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్‌ను కూడా రైతులు తమ సెల్‌ఫోన్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలు, పంటల సాగు, ప్రభుత్వ పథకాలు తదితర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వరి కోతలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఏఓ మహేష్ బాబు సూచించారు. కోసిన ధాన్యం వర్షానికి తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని, వీలైనంత త్వరగా మిల్లులకు తరలించాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రకృతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, పంట నష్టాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అద్దంకి పావని, గ్రామ వ్యవసాయ సహాయకులు, అరవపల్లి, నల్లూరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.