telangana
మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట
హైదరాబాద్, (మేజర్ న్యూస్): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ‘మోడల్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పోలీస్ స్టేషన్’గా తీర్చిదిద్దారు. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించి, నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించారు.
ఈ నూతన విధానం ద్వారా స్టేషన్‌కు వచ్చే బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ అధికారుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏఐ యంత్రం ముందు నిలబడి బాధితులు తమ సమస్యను వివరిస్తే చాలు, ఆ వ్యవస్థే పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదు కాపీని వెంటనే సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా, ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా సంబంధిత పోలీస్ అధికారులకు చేరిపోతుంది. సాంకేతికత సహాయంతో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.