telangana
జేబులో పవర్ బ్యాంక్ పేలి యువకుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, (మేజర్ న్యూస్): హైదరాబాద్‌లోని రహమత్ నగర్‌లో పవర్ బ్యాంక్ పేలిన ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా నివాసముంటున్న 29 ఏళ్ల శ్రవణ్ అనే యువకుడి జేబులో ఉన్న పవర్ బ్యాంక్ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.
ఈ పేలుడు ధాటికి శ్రవణ్ ఛాతి కుడి వైపు భాగంతో పాటు కుడి కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితుడికి సుమారు 30 శాతం మేర కాలిన గాయాలయ్యాయని మధురా నగర్ పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుడిని చికిత్స నిమిత్తం యూసుఫ్‌గూడలోని మ్యాగ్నైడ్ ఆస్పత్రికి తరలించారు. గతంలో సెప్టెంబర్ నెలలోనూ ఓ ఎమ్మెల్యే వాహనంలో ఇదే తరహాలో పవర్ బ్యాంక్ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తుచేశారు. నాణ్యత లేని ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.