విమాన క్యాబిన్ శబ్దాల తగ్గింపుపై రోల్స్-రాయిస్, ఐఐటీ కాన్పూర్ సంయుక్త పరిశోధన
సూర్య జాతీయ డెస్క్: విమాన క్యాబిన్‌లో శబ్దాలను మరింత తగ్గించే మార్గాలను అన్వేషించేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ రోల్స్-రాయిస్ మరియు ఐఐటీ కాన్పూర్ సంయుక్త పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇంజిన్ వైబ్రేషన్ల వల్ల ఏర్పడే నిర్మాణాత్మక శబ్దాలను అధ్యయనం చేయడంపై ఆరు నెలల పాటు సాగే ఈ ప్రాజెక్టు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఐఐటీ కాన్పూర్‌లో ఏర్పాటు చేసే ప్రయోగాత్మక టెస్ట్-రిగ్ ద్వారా రోల్స్-రాయిస్ రూపొందించిన న్యూమరికల్ పద్ధతిని పరిశీలించి ధ్రువీకరిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరండికర్, ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్, రోల్స్-రాయిస్ ప్రతినిధులు ఆండీ రిక్స్, రాఘవేంద్ర సరూరు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో రోల్స్-రాయిస్ ఇండియా మరియు ఐఐటీ కాన్పూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా ఈ పరిశోధన చేపట్టారు. ఉమ్మడి ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, జ్ఞాన మార్పిడి మరియు నైపుణ్యాభివృద్ధికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. అధునాతన సాంకేతికత, తక్కువ శబ్దం వంటి ప్రత్యేకతలతో గుర్తింపు పొందిన ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబీ వంటి రోల్స్-రాయిస్ ఇంజిన్ల సాంకేతికతను మరింత మెరుగుపరిచేలా ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అత్యాధునిక ఇంజనీరింగ్, పరిశోధన మరియు తయారీ రంగాలలో భారతదేశ లక్ష్యాలకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని రోల్స్-రాయిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్ అన్నారు. ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్య శిక్షణ ద్వారా విద్యార్థులకు వాస్తవ సమస్యలపై అనుభవం లభిస్తుందని ఆయన తెలిపారు.
విమాన ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంచే శబ్ద నియంత్రణ అంశాన్ని న్యూమరికల్ విధానం, ప్రయోగాత్మక పరిశీలనల కలయికతో అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టు చక్కని అవకాశమని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. వైబ్రేషన్ ప్రసారం మరియు శబ్ద తగ్గింపు వ్యూహాలపై మరింత లోతైన పరిశోధనలకు ఈ టెస్ట్-రిగ్ విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తుందని చెప్పారు. విమాన బాడీ నమూనాను వ్యవస్థాగత ఇంజనీరింగ్ విధానంతో రూపొందించి, ఇంజిన్ వైబ్రేషన్లను పోలిన యాంత్రిక ప్రకంపనలు, అత్యాధునిక సెన్సార్ల సాయంతో శబ్ద తరంగాలను విశ్లేషిస్తారు. భవిష్యత్తులో మరిన్ని దశలలో ఈ పరిశోధనను కొనసాగించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.