విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రానికి హాలీవుడ్ దిగ్గజం ఫిదా.. ఆ అమ్మాయి నటనను మర్చిపోలేకపోతున్నానన్న టామ్ హ్యాంక్స్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా, నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన థ్రిల్లర్ చిత్రం మహారాజా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటూనే ఉంది. తాజాగా ఆస్కార్ విజేత, హాలీవుడ్ దిగ్గజ నటుడు టామ్ హ్యాంక్స్ ఈ చిత్రాన్ని వీక్షించి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాలో విజయ్ సేతుపతి కుమార్తె జ్యోతి పాత్రలో నటించిన యువ నటి సచనా నమిదాస్ అద్భుత అభినయాన్ని చూసి టామ్ హ్యాంక్స్ మంత్రముగ్ధులయ్యారని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా వెల్లడించారు. ఈ మేరకు విజయ్ సేతుపతితో జరిగిన ఒక ప్రత్యేక సంభాషణలో ఆమె ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక వేడుకలో టామ్ హ్యాంక్స్ తనను కలిసినప్పుడు, చూడటానికి మూడు మంచి భారతీయ సినిమాలను సూచించమని అడిగారని కవితా గుప్తా గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాను సూచించిన చిత్రాల్లో మహారాజా కూడా ఒకటని తెలిపారు. ఆ తర్వాత నవంబర్ 7న జరిగిన మరో ప్రతిష్ఠాత్మక వేడుకలో ఇద్దరూ మళ్లీ ఎదురుపడినప్పుడు, టామ్ హ్యాంక్స్ స్వయంగా మహారాజా సినిమా ప్రస్తావన తీసుకొచ్చి తన అనుభూతిని పంచుకున్నట్లు వివరించారు.
మహారాజా సినిమాలోని ఆ అమ్మాయి నటన నుంచి తాను ఇంకా బయటపడలేకపోతున్నానని, ఆమె ఎంతో అద్భుతమైన నటి అని టామ్ హ్యాంక్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ కథలో తండ్రి పాత్ర చేసినట్లుగా తాను చేసి ఉండలేనని, ఆ విలన్‌ను కచ్చితంగా చంపేసేవాడినని టామ్ హ్యాంక్స్ తనతో అన్నట్లు కవితా గుప్తా పేర్కొన్నారు. ఫారెస్ట్ గంప్, కాస్ట్ అవే వంటి క్లాసిక్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టామ్ హ్యాంక్స్ లాంటి దిగ్గజ నటుడి నుంచి ఈ స్థాయి ప్రశంసలు దక్కడం భారతీయ సినిమాకు గర్వకారణంగా మారింది.
కాగా, 2024లో విడుదలైన మహారాజా చిత్రంలో జ్యోతి పాత్రలో జీవించిన సచనా నమిదాస్‌కు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు సైతం లభించింది. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణ్యం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం హాలీవుడ్ రీమేక్ దిశగా అడుగులు వేస్తోంది. హాలీవుడ్ రీమేక్‌లో ఏదైనా చిన్న పాత్ర ఇచ్చినా ఉచితంగా నటించడానికి తాను సిద్ధమని విజయ్ సేతుపతి ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేయగా, మరోవైపు దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ మహారాజా 2 సీక్వెల్ పనుల్లో నిమగ్నమయ్యారు.