గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ..
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల పంచాయితీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సందీప్ దీక్షిత్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం గాంధీ భవన్‌లో సందీప్ దీక్షిత్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు కూడా గాంధీ భవన్‌కు చేరుకున్నారు.
భేటీ అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మధ్య కొంత ఇష్యూ ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఎంపీ స్వతంత్రంగా వ్యవహరిస్తారని, ఆ విషయాన్ని ఆయనే చూసుకుంటారని వివేక్ స్పష్టం చేశారు. ఆ వివాదానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తాను ఎవరిపైనా ఫిర్యాదు చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి వివేక్.. తాను పార్టీ మారుతానని చెప్పడానికి కొందరికి కనీస బుద్ధి ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.